- ‘గ్రేటర్’ పోలింగ్ డిసెంబరు 1
- 4న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు
- ఈసారి బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు
- డివిజన్లలో గత రిజర్వేషన్లే వర్తింపు
- మేయర్‌గా మాత్రం జనరల్ మహిళ
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదల
- నేటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
- వరద సాయానికి గ్రీన్ సిగ్నల్
- నేరుగా నో.. బ్యాంక్ ఖాతాల్లో వేయొచ్చు
- 2700 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
- అవసరమైతే రంగంలోకి కేంద్ర బలగాలు
- విలేకరులకు ఎస్‌ఈసీ పార్థసారథి వెల్లడి
- మంగళవారం నుంచే అమల్లోకి కోడ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 1వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచారు. 4వ తేదీన కౌంటింగ్ జరిపి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. 3 గంటల సమయానికే అన్ని వార్డుల ఫలితాలు వస్తాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియంతా 17 రోజుల్లోనే పూర్తి కానుంది.
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఈనెల 20 వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూలును మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. షడ్యూల్ విడుదల చేసిన తర్వాత వివరాలను పార్థసారథి విలేకరులకు వెల్లడించారు.
షెడ్యూలు విడుదలైనందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఇటీవల అసెంబ్లీలో చట్ట సవరణ చేశారని, దాని ప్రకారమే షెడ్యూలు విడుదల చేశామని తెలిపారు.
‘‘ఈవీఎంలతో చాలా ఇబ్బందులున్నాయి. అవి మొరాయించాయని ప్రతి ఎన్నికల్లోనూ వార్తల్లో చూస్తున్నాం. సాంకేతికంగా కొన్ని సమస్యలూ వస్తున్నాయి. కౌంటింగ్ హాళ్లలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి తీరుపై ప్రధాన రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలపై కొందరు కోర్టులకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని పార్థపారథి వివరించారు. బ్యాలెట్‌కు తెల్ల పేపర్‌ను వాడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను గతంలో అప్పుగా ఇచ్చామని, వాటిని వెనక్కి తీసుకున్నామని తెలిపారు.
విధుల్లో 55 వేలమంది సిబ్బంది
ఈ ఎన్నికలకు 55 వేలమంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, వారిలో 30 శాతం రిజర్వ్‌లో ఉంటారని ఎస్‌ఈసీ తెలిపారు. ప్రస్తుతం 48 వేలమంది సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘గతంలో 1+4 చొప్పున సిబ్బంది ఉండేవారు. కరోనా నేపథ్యంలో ఒకరిని తగ్గించాం. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1+3 చొప్పున పోలింగ్ సిబ్బంది ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ వారే కాక.. చుట్టుపక్కల ఐదారు జిల్లాల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు’’ అని చెప్పారు. సిబ్బంది నివసిస్తున్న డివిజన్లలో వారికి డ్యూటీ ఉండదని, వీలైనంత వరకు ప్రతి స్టేషన్‌లో ఒక మహిళా సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆన్‌లైన్‌లో ‘నామినేషన్’ వివరాలు
నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పార్థసారథి చెప్పారు. నామినేషన్‌తోపాటు జత చేసే పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసే సౌకర్యం ఉందని, కానీ, దానిని డౌన్‌లోడ్ చేసుకుని రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా అందించాలని తెలిపారు. నామినేషన్ సమయంలో డిపాజిట్ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500, మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలని వివరించారు.
ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్ అందచేస్తామని చెప్పారు. ఎవరికైనా ఓటరు స్లిప్ అందకుంటే ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చని తెలిపారు. తమ పార్టీ గుర్తుల్లేకుండా రాజకీయ పార్టీలు ఓటరు స్లిప్‌లను అందజేయవచ్చని చెప్పారు.
పోలింగ్ శాతమే పెద్ద సమస్య
‘‘ఓటు వేయడానికి హైదరాబాదీలు ముందుకు రాకపోవడమే పెద్ద సమస్య. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 42 శాతమే పోలింగ్ జరిగింది. 2016లో ఇది 45.29 శాతం. అప్పట్లో పెరుగుతుందని ఆశించినా పెరగలేదు. అందుకే, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. రాజకీయ పార్టీలు, సినీ, క్రీడా ప్రముఖుల సహకారం తీసుకుంటాం’’ అని పార్థసారథి చెప్పారు.
ఈ ఓటింగ్ లేదు
ఈ ఎన్నికల్లో ఈ-ఓటింగ్ సదుపాయం కల్పించడం లేదని, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశముంటుందని చెప్పడంతో ఈసారికి దానిని అమలు చేయరాదని నిర్ణయం తీసుకున్నామని ఎస్‌ఈసీ పార్థసారథి చెప్పారు. ఈ-ఓటింగ్‌ను అమలు చేయాలంటే చట్టాన్ని కూడా సవరించాల్సి ఉందన్నారు. ఫేషియల్ రికగ్నిజిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
రూ.50 వేలు తీసుకెళ్లవచ్చు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాధారణ వ్యక్తి రూ.50 వేల వరకు వెంట తీసుకెళ్లొచ్చని పార్థసారథి చెప్పారు. పెళ్లి, ఇతర వ్యాపారం కోసం అంతకంటే ఎక్కువ తీసుకెళితే.. అండర్ టేకింగ్ తీసుకుని వదిలి పెడతామని చెప్పారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు సరిగా ఉంటే ఇబ్బంది ఉండదన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇది..
తేదీ షెడ్యూల్
నవంబరు 18 (బుధవారం) నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. డివిజన్లవారీగా ఓటర్ల జాబితా ప్రకటన
20వ తేదీ (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ
21వ తేదీ (శనివారం) దాఖలైన నామినేషన్ల పరిశీలన
22వ తేదీ (ఆదివారం) నామినేషన్ల ఉపసంహరణ. అదేరోజు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటన
డిసెంబరు 1 (మంగళవారం) పోలింగ్ (ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
డిసెంబరు 3 (గురువారం) రీ పోలింగ్ (అవసరమైతే)
డిసెంబరు 4 (శుక్రవారం) కౌంటింగ్. ఫలితాల ప్రకటన
ఈసారి మహిళా మేయర్
జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించినట్లు పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసినందున ఈ ఎన్నికల్లో డివిజన్ల విభజన లేదని, 2016 ఎన్నికల మాదిరిగానే 150 డివిజన్లకు పాత రిజర్వేషన్లే కొనసాగుతాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. మొత్తం అన్ని కోటాల్లో కలిపి మహిళలకు 75 డివిజన్లు దక్కనున్నాయి. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఓటర్ల జాబితా ఉండదని, అసెంబ్లీ ఎన్నికల తాజా జాబితాను సెప్టెంబరు 25, 26 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకున్నామని చెప్పారు.
దాని ప్రకారం, ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకూ ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. దానిని జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు మ్యాపింగ్ చేశామని, దాని ప్రకారం 13న ఓటర్ల జాబితాను ప్రకటించామని తెలిపారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో 9,238 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, మొత్తం స్టేషన్లపై ఈనెల 21న స్పష్టత వస్తుందని అన్నారు. సోమవారం వరకు వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి.. ప్రధాన జాబితాతోపాటు అనుబంధాన్ని ప్రిసైండింగ్ అధికారులకు పంపిస్తామని చెప్పారు.
లెక్కలు చూపించకుంటే మూడేళ్ల అనర్హత
‘‘గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.5 లక్షలు మాత్రమే. 45 రోజులలోపు ఖర్చుల వివరాలను అభ్యర్థి సమర్పించాలి. తప్పుడు వివరాలిస్తే అభ్యర్థిపై మూడేళ్లపాటు అనర్హత వేటు వేసే అధికారం మాకు ఉంది’’ అని పార్థసారథి అన్నారు. ఖర్చు పరిశీలనకు పరిశీలకులను నియమించామని తెలిపారు. ‘‘ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫారం-ఏ, ఫారం-బీలను సమర్పించాల్సి ఉంటుంది. ఫారం-ఏ నామినేషన్‌ను చివరిరోజు వరకు, ఫారం-బీ నామినేషన్లను పరిశీలన సమయంలో రిటర్నింగ్ అధికారికి ఇవ్వొచ్చు. ఫారం-ఏ లేకుండా ఫారం-బీని దాఖలు చేయొచ్చు’’ అని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ చెప్పారు.
వరద సాయం అందించొచ్చు
వరద సాయానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఉందని పార్థసారథి చెప్పారు. హైదరాబాద్‌లో వరద బాధితులకు సాయాన్ని నేరుగా ఇవ్వరాదని, వారి బ్యాంక్ ఖాతాల్లో మాత్రం వేయవచ్చని స్పష్టం చేశారు. వరద సాయంపై ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలిస్తామని తెలిపారు.
48 గంటల ముందు మద్యం బంద్
పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలపై ఆంక్షలు అమల్లోకి వస్తాయని పార్థసారథి తెలిపారు. ఆ సమయంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తోందన్నారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నారని, ఆయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతానికి 9,238 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 2,700 సమస్యాత్మకమని గుర్తించినట్లు ఎస్‌ఈసీ పార్థసారథి తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తారన్నారు. అవసరమైతే కేంద్ర బలగాలను రప్పిస్తామన్నారు.
Courtesy Andhrajyothi