గ్రేటర్‌.. ఓటు అంటే పరార్‌!

Published on

  • పోలింగ్‌కు దూరంగా నగరవాసులు..
  • ప్రతిసారీ 50 శాతానికిలోపే పోలింగ్‌..
  • 20 శాతం ఓట్లతోనే ప్రతినిధుల ఎన్నిక
  •  సెలవిచ్చినా కదలని ఐటీ, ఇతర ఉద్యోగులు
  •  ఓటు వేస్తున్నది బస్తీవాసులు, మధ్య తరగతి ప్రజలే

హైదరాబాద్‌ సిటీ : ఐదేళ్లపాటు మన సమస్యలు పరిష్కరించే.. మన మేలు కోరే నిర్ణయాలు తీసుకునే వ్యక్తినే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటాం! అందులోనూ, మొత్తం ఓటర్లలో 50 శాతానికంటే ఎక్కువమంది ఎన్నుకున్న వ్యక్తి చట్టసభ సభ్యుడు కావాలి! కానీ, మన హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. కేవలం 20 నుంచి 23 శాతం మంది ఓటర్లు ఎన్నుకున్న వ్యక్తులు కూడా ప్రజా ప్రతినిధులు అయిపోతున్నారు!

ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోకుండానే ఐదేళ్లపాటు అధికారం చలాయిస్తున్నారు. ఇందుకు కారణం.. ఓటర్లలోని.. మరీ ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లలోని నిరాసక్తత! పోలింగ్‌ రోజున ఓటు వేయడానికి ప్రభుత్వం సెలవు ఇస్తోంది! ప్రైవేటు కంపెనీలూ సెలవు ఇస్తున్నాయి! అయినా, అత్యధికులు దానిని సెలవు రోజుగానే చూస్తున్నారు. కానీ, పోలింగ్‌ రోజుగా చూడడం లేదు!

ఉదాహరణకు, 2002లో జరిగిన ఎంసీహెచ్‌ ఎన్నికల్లో కేవలం 41.22 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితంగా, కొన్ని డివిజన్లలో కేవలం 15 శాతం మంది ఓటు వేసిన అభ్యర్థులు కూడా ప్రజా ప్రతినిధులు అయిపోయారు. దాంతో, ఆ తర్వాత 2009లో వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి ఎన్నికల కమిషన్‌ ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. అయినా, కేవలం 42.92 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.

ఇక, గత (2016) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బస్తీల్లోని నిరుపేదల్లో అత్యధికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ, ఐటీ సహా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు; సంపన్న కాలనీల్లోని ప్రజలు మాత్రం పోలింగ్‌ కేంద్రాల ముఖం కూడా చూడడం లేదు. నిజానికి, ‘‘ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. మనం వేసే ఓటు అభివృద్ధికి సోపానంగా.. ప్రగతికి మార్గదర్శంగా ఉంటుంది.

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియో గించుకోవాలి’ అని ఎన్నికల సంఘం ప్రతిసారీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు గ్రామీణ ప్రాంతాల్లో ఫలిస్తున్నా.. పట్టణాలు, నగరాలు మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు మాత్రం స్పందించడం లేదు.

ఓటేసేది బస్తీలు, మధ్య తరగతి ప్రజలే
2002 నుంచి 2016 వరకు జరిగిన గ్రేటర్‌ ఎన్నికల వరకు పరిశీలిస్తే ఎక్కువగా బస్తీలు, మురికివాడలు, మధ్య తరగతి ప్రజలే ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, చందా నగర్‌, ఫిల్మ్‌నగర్‌, షేక్‌పేట, అబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో ప్రతి ఎన్నికల్లోనూ 50 శాతం కూడా పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. పాతబస్తీ, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, బేగంపేట్‌, నాంపల్లి, మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ల్లో మాత్రం ఓటింగ్‌ శాతం గరిష్ఠంగా కనిపిస్తోంది.

2002 ఎంసీహెచ్‌ ఎన్నికల్లో ఇలా
మొత్తం ఓటర్లు 26,78,009
పోలైన ఓట్లు 11,04,076
చెల్లనివి 54,837
టెండర్‌ ఓట్లు 12
పోలింగ్‌ శాతం 41.22

2009 జీహెచ్‌ఎంసీలో..
మొత్తం ఓటర్లు 56,99,639
పోలైన ఓట్లు 23,98,105
పోలింగ్‌ శాతం 42.92.

2016 జీహెచ్‌ఎంసీలో
మొత్తం ఓటర్లు 74,23,980
పోలైన ఓట్లు 33,60543
పోలింగ్‌ శాతం 45.27
2014 అసెంబ్లీలో  50.86ు (గ్రేటర్‌లో)
2018 అసెంబ్లీలో 53ు (గ్రేటర్‌లో)

Courtesy Andhrajyothi

Search

Latest Updates