ఇంటర్నెట్ వాడకంలోనూ..పట్టణ-గ్రామీణ, లింగ అంతరాలు

Published on

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ గణాంకాలు

న్యూఢిల్లీ : గ్రామీణ భారతదేశంలో 10 మంది మహిళల్లో ముగ్గురికంటే తక్కువ, పట్టణ భారతంలో 10 మందిలో నలుగురు ఇంటర్నెట్‌ను వినియోగించారు. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వాడకానికి సంబంధించి ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, పోషణకు సంబంధించి కీలక సూచికలపై గణాంకాలను సేకరించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 2019లో మొదటిసారిగా మరో రెండు నిర్దిష్ట అంశాలపై వివరాలను కోరింది. అందులో ఇప్పటివరకు ఇంటర్నెట్‌ను ఉపయోగించిన మహిళలు, పురుషుల వివరాలు కూడా ఉన్నాయి. మహిళల్లో సగటును 42.6శాతం మంది, పురుషుల్లో సగటున 62.16శాతం మంది ఇంటర్నెట్‌ను ఉపయోగించారు. రెండవది, పట్టణాల్లో సగటును 73.76శాతం మంది పురుషులు, 56.81శాతం మంది మహిళలు ఇంటర్నెట్‌ను ఉపయోగించారు. అలాగే గ్రామీణుల్లో 33.94 శాతం మంది మహిళలు, 55.6శాతం మంది పురుషులు ఇంటర్నెట్‌ను వాడారు. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3.07 లక్షల మంది నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ఈ వివరాలను వెల్లడించింది.

రాష్ట్రాలవారీగా…
మహిళల్లో ఇంటర్నెట్‌ వినియోగాన్ని రాష్ట్రాలవారీగా చూస్తే.. 10 రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50శాతం మించి ఇంటర్నెట్‌ను వినియోగించారు. అందులో సిక్కిం (90శాతం), మిజోరాం (83.8శాతం), హిమాచల్‌ ప్రదేశ్‌ (78.9శాతం), గోవా (78.1శాతం), నాగాలాండ్‌ (66.5శాతం), లఢక్‌ (66.5శాతం), కేరళ (64.9శాతం), లక్షద్వీప్‌ (61.80శాతం). మేఘాలయ (57.8శాతం), జమ్మూకాశ్మీర్‌ (55శాతం). మహారాష్ట్ర (54.3శాతం), మణిపూర్‌ (50.8శాతం) వరుస స్థానాల్లో ఉన్నాయి. మహిళల్లో అత్యల్ప స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ (33.9శాతం), బీహార్‌ (38.4శాతం), త్రిపుర (36.6శాతం), తెలంగాణ (43.9శాతం), గుజరాత్‌ (48.9శాతం) నిలిచాయి. గ్రామీణుల్లో ఇంటర్నెట్‌ను ఉపయోగించిన మహిళల శాతం గణనీయంగా పడిపోయింది. గోవా (68.3శాతం), కేరళ (57.5శాతం), సిక్కిం (68.1శాతం), మరియు లడఖ్‌ (54శాతం) మాత్రమే 50శాతానికి పైన ఉన్నాయి. గ్రామీణుల్లో అతితక్కువ శాతం వాడకంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌ (14శాతం), ఆంధ్రప్రదేశ్‌ (15.4శాతం), తెలంగాణ (15.8శాతం), త్రిపుర (17.7శాతం), బీహార్‌ (17శాతం) నిలిచాయి..

Courtesy Nava Telangana

Search

Latest Updates