స్పష్టమైన సందేశం

Published on

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క రాజకీయపార్టీకి పూర్తి మెజారిటీని అందించలేదు. మునుపు నాలుగు స్థానాలు మాత్రమే ఉన్న భారతీయజనతాపార్టీ ఈ సారి నలభై ఎనిమిది గెలుచుకుని వాస్తవ విజేతగా నిలిచింది. అందరికంటె నామమాత్రపు ఆధిక్యం కలిగి 56 డివిజన్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన తెలంగాణ రాష్ట్రసమితికి, ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా అధికారానికి అర్హత లభించదు. నలభై నాలుగు గెలుపులతో బలంగా ఉన్న మజ్లిస్ మద్దతు తీసుకోవచ్చు కానీ అందులో అనేక సమస్యలున్నాయి. మేయర్ ఎన్నిక కోసం జరగవలసి వచ్చే విన్యాసాలు, తెర వెనుక తెర ముందు కుదరవలసిన అవగాహనలు- రానున్న రోజులలో ఆసక్తికరమైన సన్నివేశంగా పరిణమించనున్నాయి.

స్పష్టంగా చెప్పుకోవాలంటే, ఇది తెలంగాణ రాష్ట్రసమితికి ఎదురైన తిరస్కారం. ఏదో రకంగా సాంకేతికంగా మేయర్ పీఠాన్ని పొందవచ్చును కానీ, వాస్తవంలో మాత్రం ఆ పార్టీ అనుభవంలో ఉన్న సంపూర్ణ అధికారం ఇప్పుడు జారిపోయింది. ప్రభుత్వం పనితీరు మీద కావచ్చు, ప్రభుత్వాధినేత వైఖరుల మీద కావచ్చు హైదరాబాద్ ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. దాన్ని వ్యక్తం చేయడానికి ఒక అవకాశం లభించింది. ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడానికి ఒక రాజకీయపక్షమూ కనిపించింది. దాని పర్యవసానమే ఈ ఫలితం. ఈ జనాదేశం కేవలం భారతీయ జనతాపార్టీకి సానుకూల ఓటు కాదు. బిజెపికి నగరంలో గట్టి పునాది ఉన్నది, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. కానీ, నగరమంతా విస్తరించిన నిలకడైన ప్రజాబలం లేదు. లోక్‌సభ, శాసనసభలలో నగరపార్టీ విజయాలు సాధించింది కానీ, అన్ని మార్లూ కాదు. బిజెపికి ఉన్న పరిమిత స్థానబలానికి, ఆ పార్టీ పరిశ్రమ, ప్రభుత్వ వ్యతిరేకత తోడయి పెద్ద విజయాలను అందించాయి. ఈ ఫలితం బిజెపికి బల్దియా కుర్చీని ఇవ్వలేదు నిజమే కానీ, రాష్ట్రస్థాయిలో అధికారసాధనకు కావలసిన ఉత్సాహాన్ని, ప్రేరణను ఇచ్చింది. జిహెచ్ఎంసి ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీశాయి. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం, ద్వితీయస్థానంలో ఉన్నది బిజెపియేనని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రాజీనామా కాంగ్రెస్‌కు ఏమి చికిత్స అందిస్తుందో చూడాలి.

ఈ ఫలితాలను మరొక రకంగా కూడా వ్యాఖ్యానించవచ్చు. ఓటర్లు టిఆర్ఎస్‌కు గట్టి చెంపదెబ్బ ఇచ్చారు, నిజమే. కానీ, అధికారం దక్కకుండా చేయలేదు. అదే సమయంలో బిజెపిని పదిరెట్లకు పైగా మెట్లు ఎక్కించారు. కానీ, అధికారపీఠానికి దిగువనే నిలిపివేశారు. అంటే, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక మాత్రమే చేయదలచుకున్నారా? బిజెపిని ప్రత్యామ్నాయంగా చూడడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా పూర్తి విశ్వాసం కుదరలేదా? నగరాభివృద్ధికి శాంతియుత వాతావరణం అవసరమని, తమ పాలనలోనే అది సాధ్యమని టిఆర్ఎస్ తన ప్రచారంలో ప్రముఖంగా చెప్పిన అంశానికి ప్రజలు కొంత విలువ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఓట్ల సరళి గురించి తరువాత వివరమైన విశ్లేషణలు వస్తాయి కానీ, అత్యాధునిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయులు అధికంగా నివసించే ప్రాంతాలలో టిఆర్ఎస్‌కు అధిక మద్దతు లభించింది. మధ్యతరగతి ప్రాంతాలు, తెలంగాణ జిల్లాల నుంచి స్థిరపడినవారి నివాసప్రాంతాలలో భారతీయ జనతాపార్టీకి అధిక ఆదరణ లభించింది. గ్రామీణ తెలంగాణతో సంబంధాలున్న నగరవాసులలో ప్రభుత్వ వ్యతిరేకత ఇంతగా ప్రతిఫలించినప్పుడు, మున్ముందు ఇతర పట్టణాలలో జరిగే నగరపాలక ఎన్నికలలో అధికారపార్టీ పరిస్థితి ఏమి కానున్నది? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు- ప్రభుత్వం మీద కోపంగా ఉన్నట్టు, బిజెపిని వారు ప్రత్యామ్నాయంగా చూసినట్టు ప్రాథమిక విశ్లేషణలు సూచిస్తున్నాయి. టిఆర్ఎస్‌ను కొద్దిగా శిక్షించి వదిలారు. మరి బిజెపిని అధికారానికి దూరంగా ఎందుకు నిలిపినట్టు? ఎన్నికల ప్రచారసమయంలో ఆ పార్టీ చేసిన ఉద్రేక ప్రకటనలు అందుకు కారణమా? తామస, ద్వేష భావాలను స్వీకరించడానికి హైదరాబాద్ నగరజీవులు సిద్ధంగా లేరు. అట్లా కాక, బిజెపి పెద్దమనిషి తరహాలో ప్రజాసమస్యలు, అభివృద్ధి ఎజెండాతో ప్రచారం చేసి ఉంటే పూర్తి ఆమోదం లభించేదా? ఆ పార్టీ సమీక్షించుకోవాలి. 1980, 90 దశకాలలోని నగరం కాదు హైదరాబాద్. నూతన సహస్రాబ్దిలో కళ్లుతెరిచిన యువతరం సంకుచిత భావాలను ఇష్టపడదు. ఈ నగరం కోటి మందికి నివాసం, ఆధారం. అశాంతి ఆవరిస్తే వారి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

పడడం మొదలయితే, పడుతూనే ఉంటామంటారు. తమని తాము సంబాళించుకుని, నడక సవరించుకుని, ఆచితూచి అడుగులు వేస్తే అథోగతిని తప్పించుకోవచ్చు. ప్రజలతో ప్రభుత్వ సంబంధం దాత, –భిక్షుక సంబంధం కాగూడదు. ఒకే ఒక్క వ్యక్తి సమస్త నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ, అనేక అత్యవసరమైన పనులను ఏళ్ల తరబడి వాయిదా వేయిస్తుంది. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేని నాయకుడి మీద క్రమంగా విముఖత ఏర్పడుతుంది. నేరుగా విమర్శించడానికి ఆస్కారం లేని నిర్బంధ వాతావరణంలో ప్రజలు విధేయులుగానే కనిపిస్తారు. అవకాశం దొరికినప్పుడు మాత్రం గట్టి దెబ్బ తీస్తారు. బహుశా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ పాలకుడినీ తీరు మార్చుకొమ్మని ప్రజలు కోరినట్టు వినము. తెలంగాణలోనే, బహుశా రాష్ట్ర సాధకుడు అయినందువల్లనేమో, ప్రజలు నాయకుడు తన సరళి మార్చుకుంటే బాగుండని ఆశిస్తూ, అందుకు అవకాశాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో అందించిన సూచన, హెచ్చరిక మాత్రం కాస్త కటువుగాను, స్పష్టంగానూ ఉండడం గమనించవచ్చు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates