లవ్ జీహాద్ చట్టాలు అవమానకరం

Published on

రష్మీ సెహగల్‌

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ”లవ్‌ జీహాద్‌ ప్రమాదాన్ని” అధిగమించేందుకు ఒక రాత పూర్వక ఆర్డినెన్సును ఆమోదించింది. అది ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. కులాంతర, మతాంతర పెండ్లిండ్లను ప్రోత్సహించేందుకు, నూతన వధూవరులకు రూ.50 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేసే పథకం ఒకటి ఉంది. కొన్ని సంవత్సరాలుగా అది అమలులో ఉన్నప్పటికీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆ పథకం అమలులో ఉంది.

2000సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయినప్పుడు కూడా నాటి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తేరీగర్వాల్‌కు చెందిన ఒక జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఇటీవల ఈ పథకం గురించి తెలియజేస్తూ, ఒక వార్తను పత్రికలకు విడుదల చేశాడు. హిందూత్వ భావజాలాన్ని అమలు చేస్తూ, ఈ పథకాన్ని రద్దు చేయాలని యోచిస్తున్న ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి మద్దతుదారైన రావత్‌ ప్రభుత్వం, ఆ అధికారి విడుదల చేసిన వార్త పట్ల ”అసహనాన్ని” వ్యక్తం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా పెండ్లిండ్ల కోసం జరిగే మత మార్పిడిలతో పాటు మామూలు మత మార్పిడికి కూడా వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి.

రావత్‌ ప్రభుత్వం నగదు ప్రోత్సాహక పథకం ప్రచారం కోసం విడుదల చేసిన వార్తపై విచారణకు కూడా ఆదేశించింది. కానీ మతాంతర వివాహాలు చేసుకున్న వారు చాలా నిరాశ చెందుతున్నారు. ”రావత్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తీరు, ఇతర మతాలకు చెందిన వారిని పెండ్లి చేసుకోవడం నేరం అని ప్రతీ ఒక్కరూ భావించే విధంగా ఉంది. ముప్పై ఏండ్లు నా దేశానికి సేవ చేసిన తర్వాత, దీనిని ఒక అవమానంగా భావిస్తున్నానని” ముస్లిం మహిళను వివాహం చేసుకున్న ఒక ఆర్మీ అధికారి (విశ్రాంత)తన కోపాన్ని వ్యక్తం చేశాడు.

ముప్పై ఏండ్లుగా వ్యాపారంలో ఉన్న ఒక ముస్లింను వివాహం చేసుకున్న ఒక ఉపాధ్యాయిని (విశ్రాంత) కూడా అదే విధమైన కోపాన్ని వ్యక్తం చేసింది. ”నా అనుభవం ప్రకారం, పెండ్లిండ్లు నమ్మకం, సమానత్వం మీద ఆధారపడతాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, బెయిల్‌ మంజూరు కాకుండా తెచ్చిన ఈ చట్టం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాల వారి మనోభావాలు అబద్దమని చూపించే ప్రయత్నంగా కనపడుతుందని” ఆమె అభిప్రాయపడింది.

ఈ కొత్తచట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, మధ్యప్రదేశ్‌, హర్యానాతో పాటు అసోం కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఆర్డినెన్సులో ”పెండ్లి చేసుకోవడం కోసం” మతం మారాలంటే పెండ్లి తేదీకి రెండు నెలల ముందు జిల్లా మెజిస్ట్రేట్‌ అనుమతి అవసరం. ఈ మత మార్పిడి బలవంతంగా గానీ, మోసపూరిత మైన పద్ధతిలో గానీ జరగడం లేదని రుజువు చేసే బాధ్యత మతం మారాలని అనుకునే వ్యక్తిదే. లేకుంటే ఆరు నెలల నుంచి మూడేండ్ల వరకు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కూడా ఇదే విధమైన చట్టం ఉంది.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రకారం, తప్పుడు సమాచారంతో, ఒత్తిడిచేసి, మితిమీరిన ప్రాబల్యంతో, బలవంతంగా, ఎరచూపి, మోసపూరితమైన మత మార్పిడికి పాల్పడిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి, ఐదేండ్లు జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ మహిళ పెండ్లి సమయంలో మైనర్‌ అయి, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెంది ఉంటే, అప్పుడు పదేండ్లు జైలుశిక్ష, రూ.25వేలు జరిమానా విధిస్తారు. ”మూకుమ్మడి మత మార్పిడిలు” చేసే సంస్థ పైన తప్పును నిర్ధారిస్తూ, 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50వేలు జరిమానాను విధిస్తారు.

ఉత్తరాఖండ్‌లో ఒక దేవాలయ పూజారి కూతురైన ఒక ఉపాధ్యాయిని (విశ్రాంత) కూడా మతాంతర వివాహాల చుట్టూ వక్రీకరించిన కథనం తీరు పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో మత సంస్థలు, ముస్లింను పెండ్లి చేసుకోకుండా తనను ఏ విధంగా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాయో గుర్తుకు తెచ్చుకుంది. ”కానీ ఆ పని చాలా మర్యాదగా, వ్యూహాత్మకంగా చేసే వారనీ, నేడు మనం ఎదుర్కొంటున్న విధంగా భయంకరమైన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఉండేది కాదని” ఆమె పేర్కొంది.

ఉత్తరాఖండ్‌కు బయట ఉన్న ప్రాంతాల్లో మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో ఉన్న భావనలు ఆ విధంగా ఉన్నాయి. తమ పిల్లల గురించి సామాజిక మాధ్యమాల్లో అవమానకరమైన, తప్పుడు సమాచారాన్ని ఇస్తారన్న భయంతో తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ, తమ పేర్లను బయట పెట్టవద్దని కోరుకుంటున్నారు. అదే విధంగా రాజధానిలో ఉంటున్న ఒక ముస్లింను పెళ్లి చేసుకున్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌, ప్రముఖ టీవీ ఛానెల్స్‌లో ప్రతి రోజు రాత్రి ముస్లింలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశంతో చేస్తున్న మోసపూరిత ప్రసంగాలను విని భయపడు తున్నామని, తాను, తన భర్త టెలివిజన్‌ ఉద్యోగులుగా జీవితాన్ని ప్రారంభించామనీ, అందువలన, తమకు లవ్‌ జిహాద్‌ గురించి చేసే ప్రచారం వాస్తవానికి చాలా దూరంగా ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి, తమకు ”అది అస్సలు సమ్మతం కాదని” పేర్కొంది. ఆమె భర్త కుటుంబ సభ్యులు అందరూ దాదాపు ఏదో ఒక వత్తిలో ఉన్నారు. అతని తండ్రి ఐఏఎస్‌ అధికారి. ”అందువలన తన భర్త లౌకిక భావాలు గల వాతావరణం లో పెరిగిన విషయం కూడా ఆయనకు గుర్తుంటుందని” ఆమె చెప్పింది.

కానీ ఈ ప్రొఫెసర్‌ తల్లిదండ్రుల కుటుంబంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ”నా తండ్రి ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు) క్రియాశీలక కార్యకర్త. ప్రతీ రోజు ఉదయం టిఫిన్‌ తినే సమయంలో ముస్లిం వ్యతిరేక తిట్ల దండకం మొదలుపెట్టే వాడు. కానీ ఆయన కూడా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా నేడు మాట్లాడే భాషకు భిన్నంగా, వినదగిన భాషనే మాట్లాడేవాడని” ఆమె అంటుంది. ఆమె ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలుసుకున్న తన తండ్రి ”విస్మయం” చెందాడు. ఆమెతో రెండేండ్లు మాట్లాడలేదు. పెండ్లికి తన తండ్రి హాజరవ్వాలన్న పట్టుదల వల్లే, నాడు డిప్యూటీ ప్రధానిగా ఉన్న అద్వానీ జోక్యాన్ని ఆమె కోరాల్సి వచ్చిందని చెప్పింది.

యుక్తవయసులో ఉన్న వీరి కూతురు చిన్నప్పట్నుంచి రెండు మతాల గురించి వాస్తవ విషయాలను తెలుసు కుంది. ప్రొఫెసర్‌ ఆమెకు ఇస్లాం, హిందూ మతాలకు సంబంధించిన మౌలిక విషయాలను చెప్పింది. ప్రొఫెసర్‌ బెంగాలీ కాబట్టి, వారి కుటుంబం దుర్గాపూజతో పాటు అన్ని పండుగలను జరుపుకుంటుంది. ”రంజాన్‌ మాసంలో నేను కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉంటాననీ, కానీ నేను మతం మార్చుకోవాలని ఎవరూ, ఎటువంటి ఒత్తిడి చేయలేదని” చెప్పింది. కానీ ఇప్పుడు తన కూతురు గురించి భయపడుతుంది. అమ్మాయి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడి పోవడమే తనకు ఇష్టం అని ఆ ప్రొఫెసర్‌ చెపుతుంది.

మతాంతర వివాహం చేసుకున్న నిరుపేదలకు ఎంపిక ప్రక్రియలు కూడా ఎక్కువగా లేవు. ఒక ముస్లిం అమ్మాయిని పెండ్లి చేసుకున్న హిందూ యువకుడు, తమలాంటి మతాంతర పెండ్లిండ్లు భవిష్యత్తులో అంత ప్రోత్సాహకరంగా ఉండవని నమ్ముతాడు. ”నా భార్య నాతో పాటుగా గుడికి వస్తుంది, ఒక హిందూ మహిళ లాగే జీవనం సాగిస్తుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులను గుడికి వెళ్ళమని ప్రోత్సహించం, ఎందుకంటే అదే శత్రు భావనను కలిగిస్తుందని” అతడు అంటాడు.

రాజకీయ వ్యాఖ్యాత ఎస్‌ఎంఏ కజ్మీ ”లవ్‌ జీహాద్‌” అనేది ముస్లింలను ప్రమాదకారులుగా చూపించే ఒక ప్రభుత్వ విధాన కొనసాగింపని అభిప్రాయపడ్డాడు. ”ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో రెండు సంవత్సరాలలో ఎన్నికలు జరుగనున్నాయి. రామ మందిరం అంశం ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం లేదు. నిరుద్యోగం, నేరాల పెరుగుదల, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు మిలియన్ల సంఖ్యలో ప్రజలను దిక్కులేని వారిని చేసాయి. కాబట్టి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి రెండు మతాలను విభజించి, హిందూ ఓట్లు దండుకునేందుకు లవ్‌ జిహాద్‌ తగిన ఆయుధమని పాలకులు భావిస్తున్నారు” అని ఆయన అన్నాడు.

హిందూ స్త్రీల ”గౌరవం” ముస్లింల వలన ప్రమాదంలో పడినట్టు ప్రతి మనిషి నమ్ముతున్నాడు. హిందూ మహిళలను ఇస్లాం మతస్థులుగా మార్చేందుకు, ముస్లింలు తమను పెండ్లి చేసుకొమ్మని వెంట పడుతున్నట్టు విస్తృత ప్రచారం ద్వారా అందరిని నమ్మిస్తున్నారు. వ్యక్తిగత గౌరవం, ”హిందూ మతానికి ఒక సవాల్‌గా” మారింది. అనేక రాజకీయ పార్టీలు, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే కొత్త, ప్రతిపాదిత చట్టాలపై మౌనంగా ఉన్నాయి.

మొత్తం లవ్‌ జిహాద్‌ అనే భావన బలహీనమైన పునాదులపై ఆధారపడి ఉంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, కాన్పూర్‌లో 11 ”లవ్‌ జిహాద్‌” కేసులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక పరిశోధన టీంను ఏర్పాటు చేసింది. తమ పెళ్ళిళ్ళలో ”లవ్‌ జిహాద్‌”కు సంబంధం ఉందన్న తప్పుడు భావనను అనేక కేసుల్లో మహిళలు కొట్టిపారేశారు. మూడు కేసులలో పెండ్లికి ముందు పురుషులు తమ గుర్తింపును దాచారన్న ఆరోపణలు ఉన్నాయి. ”కేవలం మూడు కేసుల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపే ఆర్డినెన్సును తీసుకొని రావడం అసాధారణంగా కనిపిస్తుందని” కజ్మీ అన్నాడు. ఇది మాత్రమే కాదు. గత సంవత్సరం, పార్లమెంట్‌లో ఒక కేంద్ర మంత్రి, దేశంలో ప్రధానమైన పరిశోధన ఏజెన్సీ, ఒక్క ‘లవ్‌ జిహాద్‌’ కేసును కూడా గుర్తించలేదని ప్రకటించాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ మంత్రి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌, పెద్ద సంఖ్యలో జరిగే ”మత మార్పిడుల” కారణంగా అటువంటి ఒక చట్టం అవసరం అని గట్టిగా పట్టుపట్టాడు.

ఉత్తరప్రదేశ్‌ మాజీ డీఐజీ వీఎన్‌ రారు చెప్పిన దాని ప్రకారం, హిందూ, ముస్లిం మతాల మధ్య పెంచిన అపనమ్మకం, ద్వేష భావానికి సంబంధించిన కథనాలను నేడు కొద్ది సంఖ్యలో ఉన్న మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు అధిగమించలేరు. వారి మధ్య ఉన్న పరస్పర అనుమానం, అపనమ్మకాన్ని తెలియజేసే సమాచారం కావలసినంత అందుబాటులో ఉంది.

అది అలా కొనసాగుతుందని ఆయన అన్నాడు. ”ఎక్కడ ప్రేమ ఉంటుందో, అక్కడ జీహాద్‌ అవసరం ఉండదని”, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ అధిపతి, డాక్టర్‌ రంజనాకుమారి అభిప్రాయ పడింది. ఆమె ఈ కొత్త చట్టాలను ”రాజకీయ ప్రేరేపితం అనీ, పురుషాధిక్యత భావన కలిగి ఉండే, సమాజ వ్యతిరేకమైన, పితృస్వామిక చట్టాలుగా గుర్తించింది”.

సంఫ్‌ుపరివార్‌ సృష్టించే కొన్ని ఊహాజనితమైన విషయాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్సులను, చట్టాలను తీసుకొని రావడం విచిత్రంగా ఉంది. చట్టపరమైన గుర్తింపులేని ఒక పదం (లవ్‌ జిహాద్‌), ఒక చట్టం చేయడానికి ఆధారంగా మారింది.

Courtesy Nava Telangana

Search

Latest Updates