ప్రగతిశీల శక్తులు తప్పనిసరి చదవ వలసిన మార్క్స్ వాద సాహిత్యం.

Published on

రేకా చంద్రశేఖర రావు

ఈ సాహిత్యం చదివిన వారి కోసం కాదు, చదవని వారి కోసం మాత్రమే.

మార్క్స్ వాద సాహిత్యంలో సిధ్దాంతసాహిత్యం ఎంతవుందో అంతకంటే ఎక్కువగా ఆ సిధ్దాంతాలను అన్వయిస్తూ, బలపరుస్తూ వచ్చిన నవలా సాహిత్యం, కథా సాహిత్యం అంతకు కొన్ని రెట్లు ఎక్కువ వుంది. అంత సుసంపన్నమైన సాహిత్యం ఏ ఇతర నిబధ్ద సిధ్దాంతానికి లేదని చెప్పవచ్చును.

ఒక 40 లేక 50 సంవత్సరాల క్రితం వామపక్షాలు తమ సంస్తలలోకి సభ్యులను చేర్చుకునేందుకు ఆ సాహిత్యాన్ని ఒక సిలబస్ లాగాతయారు చేసి చదివించిన కాలం వుంది.

వామపక్షేతర వాదులకు అంత ఎక్కువగా చదవాల్సిన అవసరం వుండదు గదా! ముఖ్యంగా బౌద్దవాదులు, అంబేద్కర్ వాదులు మార్క్స్ వాద సిధ్ధాంత పరిజ్ఞానము పొందటానికి ఏమేమి చదవాలి అనేదే ఇక్కడి సందర్భం.

  1. అమ్మ నవల రచన . మాక్సింగ్ గోర్కీ – అనువాదం కొవ్విడి లింగరాజు .

ప్రపంచ సాహిత్యంలోనే అద్భుతమైన నవల. రష్యా కార్మికుల జీవితాలను, వారి కష్టాలను, బాధలను అద్భుతంగా చెప్పిన మహాకావ్యం.

ఈ నవల చదవడంద్వారా సామ్యవాద సిధ్దాంతాలను లోతుగా అర్ధంచేసుకోగలుగుతారు. అందులో “అమ్మ” కుమారుడయిన “పావెల్ “ అతని స్నేహితులు జరిపే చర్చలు మనలను ఎంతో ఆలోచింప చేస్తాయి.సామ్యవాద వ్యవస్త కావాలని వారు పడే తపన ద్వారా మనకు సామ్యవాద సిధ్దాంతాలన్నీ చక్కగా అర్ధం అవుతాయి.

కఠిన సిధ్ధాంత సాహిత్యాన్ని కొత్త వాళ్ళు చదివి అర్ధం చేసుకోవడం కష్టం కనుక వామపక్ష సిద్ధాంతాలను తేలికగా అర్ధం చేసికునేందుకు “అమ్మ నవల “ ఎంతో తోడ్పడుతుంది.

  1. ఉక్కుపాదం. రచన. జాక్ లండన్. ఈ నవల లో రచయిత అద్భుతమైన మార్క్స్ వాద సిధ్ధాంత చర్చలను ఎంతో శక్తివంతంగా రాశాడు. పెట్టుబడిదారీ దోపిడీని, పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను “అదనపువిలువ” ద్వారా ఎలా దోపిడీ చేస్తున్నదీ చక్కగా వివరిస్తాడు. ఈ నవల కథా నాయకుడు పేరు సరిగా గుర్తు రావడంలేదు, బహుశా “ ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్”  అనుకుంటాను, కాకపోతే మన్నించండి.

ఆయన పెట్టుబడిదారులను ప్రశ్నించే తీరు, వారి దోపిడీని, వారు దోపిడీ కోసం అనుసరించే హింసా పూరిత పధ్దతులను తన వాదనల ద్వారా చాలా చక్కగా బయట పెడతాడు. ఈ రెండు నవలలు చదివిన తర్వాత కొత్త పాఠకుడు మార్క్స్ వాద సిధ్దాంతాలను తెలుసుకోవాలనే ఉత్సుకతకు గురవడమేగాక ఆ సిధ్దాంతాలను అవగాహన చేసుకోగలిగిన మానసిక స్తితిని కలిగి వుంటాడు.

  1. కమ్యూనిష్టు ప్రణాళిక. రచన. కారల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్. “ప్రపంచ కార్మికులారా! ఏకంకండి, మీకు పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప” అనే నినాదం మొదటగా ఈ పుస్తకంలోనే ఇచ్చారు. ఈ పుస్తకం అంతా అద్భుతమైన వేగం- వాడి అయిన పదజాలాలతో నిండి వుంటుంది. మహనీయయులు తమ సామ్యవాద సిధ్దాంతాలను సంక్షిప్తంగా ఒక ప్రణాళిక రూపంగా చెప్పిన గొప్ప రచన. కారల్ మార్క్స్ యవ్వనంలో మంచి కవితలు రాసేవాడు, ప్రేమ కవితలు కూడా యవ్వన ప్రారంభంలో రాశాడు.

ఎవరు చెప్పారో గుర్తులేదు, కమ్యూనిష్టు ప్రణాళికలోని కవితాత్మక శైలిని చూసి, కారల్ మార్క్స్ సిధ్దాంతరంగంలోకి రాకుండా, కవిత్వానికి, సాహిత్యానికి పరమితమయి నట్లయితే  ప్రపంచ గొప్ప మహా కవులలో ఒకరు అయివుండేవారు, అని చెప్పారు.

  1. మానవ కళ్యాణానికి మార్క్స్ – ఎంగెల్సుల మైత్రి. రచన. ఎ.పి. విఠల్.

ఈ పుస్తకంలో మార్క్స్- ఎంగెల్స్ ల  జీవితము- కృషి లను రచయిత చాలా గొప్పగా రాశారు. ప్రపంచ పీడిత ప్రజల విముక్తి పట్ల వారి దీక్ష-నిబద్దత- కష్ట సహిష్ణుత- త్యాగశీలత మనలను కట్టి పడేస్తాయి. అనారోగ్య పరిస్తితులలో – తీవ్ర ఆర్ధిక పరిస్తితుల కారణంగా భార్యా-పిల్లలను కోల్పోయిన పరిస్తితులలో కూడా తన కార్యదీక్షను వదలని కారల్ మార్క్స్ మన మనస్సుల నిండా ఆర్ద్రతతో నిండి పోతాడు.

రచయిత సరళంగా హృదయాలను తాకే విధంగా రాసిన ఈ రచన మన తెలుగు ప్రజలందరినీ ఎంతో ఆకట్టుకుని ప్రభావితులను చేసింది.

  1. పెట్టుబడి- కారల్ మార్క్స్ రచన. దీని సులభ పరిచయం రంగనాయకమ్మ గారు రాశారు, సరళమైన భాషా రచనకు మరోపేరు రంగనాయకమ్మగారు. చాలా చక్కగా మంచి ఉపాధ్యాయుడు చెబితే విద్యార్ధికి అర్ధమైన విధంగా రాశారు.
  2. సోషలిజం ఓనమాలు. రచయిత పేరు గుర్తు లేదు. ఈపుస్తకంలో సోషలిజం గురించి అరటిపండు వలచినంత తేలికగా అర్ధం అయ్యేలా రచయిత చెబుతాడు.
  3. మార్క్సిజం అంటే ఏమిటి? రచన. ఎమిలీ బరన్స్. మార్క్సిస్ట్ సిధ్దాంతాన్ని చాలా చక్కగా సరళంగా రచయిత వివరించారు.

ఇవి 7 పుస్తకాలు ప్రాధమిక పరిజ్ఞానం  ఏర్పడటానికి ఎవరికి అయినా అందరికి కూడాచాలా బాగా వుపయోగ పడతాయి.

అ  తరువాత వీలుని బట్టి ఈ క్రిందివి చదివితే మంచి అవగాహన ఏర్పడుతుంది.

A.ఎంగెల్స్   రాసిన కుటుంబము-వ్యక్తిగత ఆస్తి – రాజ్యాంగాల- పుట్టుక.

  1. సోషలిజం ఊహా జనితమా! శాస్త్రీయమా!

C.లెనిన్ రచనలు “పెట్టు బడిదారీ విధాన అత్యున్నత దశ సామ్రాజ్య వాదం.

  1. రాజ్యాంగ యంత్రము- విప్లవము.
  2. “ఏమి చేయాలి” చదవాలి.
  3. స్టాలిన్ రాసిన లెనినిజం పునాదులు. G. గతితార్కిక భౌతిక వాదం .
  4. మావో రాసిన “ నూతన ప్రజాస్వామిక విప్లవం”
  5. హూనాన్ రైతు పోరాటం” మొదలయినవి చదవాలి.

ఈసాహిత్యం చదవడంలో మార్క్స్- ఎంగెల్స్ ల నుండి, లెనిన్, స్టాలిన్, మావోల వరుస క్రమంలో చదివితే సిధ్దాంతం సవ్యంగా అర్ధం అవుతుంది, సరయిన పునాది ఏర్పడుతుంది. అలా కాకుండా వెనక నుండి అంటే మావో ; తర్వాత స్టాలిన్ దగ్గర నుండి చదవడం జరిగితే సరయిన బలమైన పునాది ఏర్పడదు. ఇది మావో-స్టాలిన్లను తక్కువ చేయడం  ఏ మాత్రం కాదు.తప్పని సరి వరుస క్రమం కోసం మాత్రమే చెప్పడం జరిగింది.

మార్క్స్ వాద రచనలలో నవలా సాహిత్యం ఒకదానిని మించి ఒకటి వున్నాయి. ఇవి ఎలా చదివినా పరవాలేదు.

వాటిలో

  1. కాకలు తీరిన యోధుడు.
  2. అజ్నాతవీరుడు.

C.బీళ్ళు దున్నేరు.

  1. ఇంద్ర ధనస్సు.
  2. పునరాగమం.
  3. తల్లీ భూదేవి.

G.నీలం నోట్ బుక్.

  1. మయకోవస్కీ లెనిన్ కావ్యం మొదలయిన రష్యన్ నవలా సాహిత్యం;
  2. తండ్రులు – కొడుకులు.
  3. భూలోక నరకం.
  4. నా కుటుంబం.
  5. ఉదయగీతిక మొదలయిన చైనా నవలా సాహిత్యం అద్భుతమైనవి వున్నాయి.

మన తెలుగులో కూడా  A.మృత్యుంజయులు.B. చిల్లర దేవుళ్ళు .

  1. మోదుగుపూలు.
  2. ప్రజలమనిషి.

E.సింహగర్జన వంటి నవలలు.

  1. శ్రీశ్రీ – మహా ప్రస్తానం.
  2. కుందుర్తి తెలంగాణ కావ్యం.

H.విప్లవ పథంలో నాపయనం – సుందరయ్య .  వంటివి వున్నాయి.

ఇవి అన్నీ చదవాల్సిన అవసరం వామపక్షేతరులకు లేదు, చదవగలిగితే మంచిదే. చదివే వారికి పుస్తకాలు దొరికే సౌలభ్యాన్ని బట్టి చదవవచ్చును.

వామపక్షేతరులు 7 వ నంబరు వరకు చదివితే చాలును, వారికి ప్రాధమిక పరిజ్ఞానం తప్పక కలుగుతుంది. దాని ద్వారా మార్క్సిజం మీద ఏర్పడివున్న  అపోహలు పోవడానికి మార్క్స్ వాదులతో స్నేహ పూరితంగా వుండటానికి , వుమ్మడి లక్ష్యాల కోసం కలసి పనిచేయగల మానసిక స్తితిని పొందుతారు.

మార్క్స్ వాదులు బౌద్ద సాహిత్యం- అంబేద్కర్ సాహిత్యం ఎలా చదవవలసి వున్నదో; అలాగే అంబేద్కర్ వాదులు- బౌద్దవాదులు మార్క్స వాద సాహిత్యం చదవడం దేశ ప్రజల మంచి భవిష్యత్తు కోసం తప్పని సరి అవసరం. ఈ వ్యాస ఉద్దేశం కూడా అదే.

ప్రాధమిక పరిజ్నానం కోసం నేను సూచించిన దానికంటే మంచి ప్రతిపాదన ఎవరయినా సూచిస్తే  దానిని ఆచరించవచ్చును. పై పుస్తకాలు విశాలాంధ్ర, ప్రజాశక్తిలో దొరకవచ్చును.

Search

Latest Updates