మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం

Published on

వై. కేశవరావు
(వ్యాసకర్త ఎ.పి రైతు సంఘం అధ్యక్షులు)

అంబానీ, అదానీలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొనడానికినిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. వీరికి ఎటువంటి నిబంధనలు వర్తించవు.

కిసాన్‌ ముక్తి మోర్చా పేరుతో 500 రైతు సంఘాలు ఢిల్లీ చేరి 20 రోజులు అవుతుంది. రైతాంగం చేస్తున్న పోరాటానికి భారత్‌ బంద్‌ సందర్భంగా కార్మిక వర్గాలతో సహా దేశ ప్రజానీకం యావత్తూ మద్దతు తెలిపింది. అంతర్జాతీయంగా సంఘీభావం వచ్చింది. బిజెపి ప్రభుత్వం మాత్రం చట్టాలను రద్దు చేసే సమస్య లేదని తేల్చి చెప్పింది. పోరాడుతున్న రైతాంగంపై నిందలకు దిగింది. వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ బిల్లు-2020 రద్దయ్యే వరకు పోరాటాన్ని ఉధతం చేస్తామని 500 రైతు సంఘాలు ముక్త కంఠంతో చెప్పాయి. రైతాంగం మరింత సమీకృతం అవుతున్నారు. మోడీ ప్రభుత్వంపై పోరాటంతో పాటు భారతదేశ బడా పెట్టుబడిదారులైన అదానీ, అంబానీల వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఈ ఇరువురు మోడీ ప్రభుత్వానికి అండగా వుండగా… మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా వీరి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది.

అదానీ, అంబానీలకు విస్తారమైన వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల యావత్‌ ప్రజానీకం ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడి తీవ్ర నష్టాలపాలయ్యాయి. అయినప్పటికీ వీరిద్దరి ఆదాయాలు మాత్రం అత్యధికంగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు వీరిద్దరికీ మరింత లాభాలు చేకూర్చుతున్నాయి అదానీ, అంబానీలు విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రధానమైన ఉత్పత్తిదారులు. ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులకు అయ్యే ఉత్పత్తి ఖర్చు మేరకు లాభాలు కలిపి యూనిట్‌ ధరను నిర్ణయించాలని విద్యుత్‌ బిల్లు-2020 పేర్కొన్నది. అందుకుగాను రైతాంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ స్థానంలో మీటర్లు పెట్టాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం 25 కోట్ల స్మార్ట్‌ మీటర్ల తయారీ ఆర్డర్‌ రిలయన్స్‌కు దక్కింది. ఈ మీటర్ల వల్ల అంబానీకి కనీసం రూ.50 వేల కోట్లు లాభం చేకూరుతుందని ఆర్థికవేత్తల అంచనా. విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ మొత్తం కారుచౌకగా ప్రైవేటు వారికి అప్పగించాలనే జీవో విడుదల చేసింది. మొత్తం పంపిణీ వ్యవస్థ వీరిద్దరి కనుసైగ తోనే నడవనుంది. ‘విద్యుత్‌ బిల్లు-2020’ అదానీ కార్యాలయంలోనే తయారయిందన్న వార్తలు వచ్చాయి.

అంబానీకి దేశవ్యాప్తంగా రిటైల్‌ మాల్స్‌ ఉన్నాయి. అదానీకి ఎగుమతి వ్యాపారాలు ఉన్నాయి. అంబానీకి దేశంలోనే ప్రధానమైన బట్టల పరిశ్రమ ఉన్నది. వీరిద్దరికీ అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కొనడానికి, నిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే రైతుల దగ్గర కిలో రూ.60 కొంటున్న మినుములు గుళ్ళుగా మార్చి…కిలో రూ.200కు అమ్ముకుంటున్నారు. కిలో రూ. 60కు కొంటున్న పెసలు కిలో రూ.170కు అమ్ముకుంటున్నారు. ఈ చట్టాల వల్ల రు.300కు అమ్ముకున్నా వీరికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. అదానీకి 2019 లోనే 9 వ్యవసాయ వ్యాపారాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ శుభసమయంలో అదానీకి హర్యానా లోని బి.జె.పి ప్రభుత్వం భారీ గోడౌన్లు నిర్మించుకోవడానికి భూములు కేటాయించింది. నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ సొమ్ములో సింహభాగం వీరికే దక్కుతుంది. నేరుగా రైతుకు దక్కేది ఒక్క రూపాయి కూడా లేదు. ఈ చట్టాల వల్ల అదానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువచేసే పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఎటువంటి నిబంధనలు వర్తించవు.

అంబానీకి దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వ్యాపారాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల పెట్రోలు డీజిల్‌ ధరలు 40 శాతానికి పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయినా మోడీ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలను కొల్లగొడుతోంది. పాపం అంబానీ గారికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పడిపోకుండా మోడీజీ కాపలా కాస్తున్నారు కదా! ఈ లాక్‌డౌన్‌ కాలంలో రిలయన్సు వారికి పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు లాభం చేకూరిందో ఏ లెక్కల మాష్టారయినా చెప్పగలరు. అంబానీ, అదానీల వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి…మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పెట్లో పెట్టడానికి…మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో వైపు కార్మికవర్గం 100 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న హక్కులన్నిటిని హరిస్తూ కార్మిక కోడ్‌లు చేసింది. అందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. అందుకే వీరికి కోర్టుల వల్ల ఏ ఇబ్బందీ కలగనీయకుండా….చట్టంలో కోర్టులపై నిషేధం పెట్టారు. అందుకు బదులుగా అంబానీ తదితరులు వారి పాదాక్రాంతమై ఉన్న ప్రచార మాధ్యమాలు వీసమెత్తు మాట పడకుండా చూడటంతో పాటు, రైతుల సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేయకుండా తొక్కిపెడుతున్నారు. అంబానీ, అదానీల వస్తువులను బహిష్కరించాలని కిసాన్‌ ముక్తి మోర్చా ఇచ్చిన పిలుపు సముచితమైనది. ఇది స్వాతంత్రోద్యమంలో వస్తు బహిష్కరణ వంటిదని పలువురు చెబుతున్నారు. ప్రజలందరూ దీనిని అమలు పరచాలి.

Courtesy Prajashakti

Search

Latest Updates