– అధిక కేసులు ఆ రాష్ట్రాల నుంచే..!
– ఎన్సీఆర్బీ తాజా సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశద్రోహ చట్టం క్రియాత్మకంగా ఉన్నది. ఈ చట్టం కింద అధిక కేసులు ఈ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా సమాచారంలో ఇది వెల్లడైంది. ఎన్సీఆర్బీ తాజా సమాచారం ప్రకారం.. 2014 నుంచి దేశద్రోహం కేసులను పరి గణలోకి తీసుకోవడం ప్రారంభమైంది. ఆ ఏడాది దేశద్రోహం చట్టంకింద (ఐపీసీ సెక్షన్ 124 ఎ కింద) 47 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2019లో 93కి పెరిగాయి. కేవలం ఐదు ఏండ్లలోనే కేసుల పెరుగుదల 98శాతం కావడం గమనార్హం. 2014లో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క దేశద్రోహ కేసూ నమోదు కాలేదు. అయితే ఈ సంఖ్య గతేడాది 19కి పడిపోయింది. ఇది చాలా కఠినమైన చట్టమనీ, ప్రజలపై అభియోగాలు మోపడానికి మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాన్ని కఠినంగా అమలు చేశాయని విశ్లేషణలో తేలింది. క ర్నాటక, అసోం, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో నమోదైన కేసుల ద్వారా ఇది వివరించబడింది.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత (జమ్మూకాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం) దేశద్రోహ కేసలు పెరిగాయి. 2019లో కర్నాటకలో అధికంగా దేశద్రోహ కేసులు 22గా నమోదయ్యాయి. ఇక అసోం (17), జమ్మూకాశ్మీర్ (11)లలోనూ కేసులు రికార్డయ్యాయి. అయితే, ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలపై గొంతెత్తే హక్కుల కార్యకర్తలపై దేశద్రోహ అబియోగంతో ప్రభుత్వాలు వారి నోటిని మూసే ప్రయత్నాలు చేస్తున్నాయని సామా జిక, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి ఆరో పిస్తున్నారు. అటు కేంద్రంలో మోడీ సర్కారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్ర భుత్వాల తీరు ఇందుకు అద్దం పడుతోంది. 2016లో అసోంలో బీజేపీ అదికారంలోకి వచ్చే నాటికి ఒక్క దేశద్రోహం కేసూ లేదు. కానీ, అక్కడ కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పర్చిన తర్వాత ఈ కేసులు పెరిగాయి. జార్ఖండ్‌లో 2018లో బీజేపీ పాలనలో అత్యధికంగా 18 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్డీయే పాలిత రాష్ట్రం బీహార్‌లో 17 కేసులు రికార్డయ్యాయి. శ్యామ్ బెనెగల్, మణిరత్నం సహా 49 మంది ప్రముఖులపై బీహార్ పోలీసులు అప్పట్లో దేశద్రోహ కేసు నమోదు చేశారు.
ఇక యూపీలో 2019లో 10 కేసులతో సెక్షన్ 124 ఎ ఉదార వినియోగం కనబడుతోంది. 2016లో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో ఆరు కేసులు నమోదు కాగా, ఇప్పుడు యోగి హయాంలో అది పదికి చేరడం గమనించాల్సిన అంశం. ఢిల్లీలో ఆప్ పాలనలో 2016-19 మధ్య నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో 2014 నుంచి ఆరేండ్లలో 12 కేసులు ఉన్నాయి. ఇక నాగాలాండ్‌లో 2019లో ఎనిమిది కేసులు రికార్డయ్యాయి. ఇక్కడ ప్రస్తుత సీఎం నిఫియో రియో బీజేపీతో పొత్తులో ఉన్న విషయం విదితమే. బీజేపీ గత రెండేండ్ల పాలనలో మణిపూర్‌లో ఐదు కేసులు ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో తమిళనాడులో 2017-19 మధ్య ఎనిమిది కేసులు రికార్డయ్యాయి. తెలంగాణలో 2016-19 మధ్య నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వలసరాజ్యాల చట్టం స్వతంత్ర భారతంలో భాగం కాకూడదని సామాజిక కార్యకర్త నిఖిల్ డే అన్నారు. ఇది దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Courtesy Nava Telangana