నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే..

Published on

– అప్పటివరకూ రైతుల ఆందోళన ఆగదు : రైతు సంఘాలు
– ఢిల్లీ శివారులో కొనసాగుతున్న నిరసనలు
– ప్రయివేటు, కార్పొరేట్‌ శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాం..
– కేవలం ఎంఎస్‌పీ కోసమే పరిమితం కాలేదు..

న్యూఢిల్లీ : ఢిల్లీ శివారుప్రాంతాల్లో రైతుల చేపట్టిన ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రైతాంగ హక్కులు, ప్రయోజనాల కోసం మొదలైన ఈ ఉద్యమం క్రమంగా ఉధృతమవుతోంది. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహిస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని రైతులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఈ ఆందోళన కేవలం ‘కనీస మద్దతు ధర’కు పరిమితమైన అంశం కాదని, వ్యవసాయరంగంలో కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులు చొరబడకుండా రక్షించుకోవటం అత్యంత కీలకమని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. మోడీ సర్కార్‌ అనుకూల మీడియా తమ రైతుల నిరసనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని వారు ఆరోపించారు.

చట్టాల్ని ఉపసంహరించాల్సిందే..
రైతుల సంక్షేమం, వారి ఆదాయం రెట్టింపు పేరిట మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు వారం రోజులుగా నిరసన గళం వినిపిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లు, ప్రయివేటు శక్తులకు తప్ప తమకేమీ ఒరిగేదేమీ లేదని రైతు సంఘాలు వాపోతున్నాయి. చట్టాల్ని ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ చట్టాల వల్ల..వ్యవసాయ మార్కెటింగ్‌లో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారుతుందని, కొన్నాండ్లుకు కనీస మద్దతు ధరను కూడా రద్దు చేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నాయి. విద్యా వ్యవస్థ ఎలాగైతే ప్రయివేటు, కార్పొరేట్‌పరమైందో…అలాగే వ్యవసాయరంగమూ తయారవుతుందని, కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ (ఒప్పంద సేద్యం) బలపడుతుందని, పత్తి, చెరకు, పసుపు, మిరప, ధాన్యం, గోధుమ…మొదలైన పంటలు కార్పొరేట్‌ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతాయని వ్యవసాయరంగ నిపుణులు అంచనావేస్తున్నారు.

ఎంఎస్‌పీ మరిన్ని పంటలకు ఇవ్వాలి : అవతార్‌ సింగ్‌, ఫతేగర్‌, పంజాబ్‌
రైతాంగమంతా ‘కనీస మద్దతు ధర’ కోసం ఉద్యమిస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం 23 పంటలకు మాత్రమే ఎంఎస్‌పీ వర్తిస్తోంది. దీనిని మరిన్ని పంటలకు వర్తింపజేయాలని కోరుతున్నాం. అయితే సమస్య ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా రైతులకు ఎంఎస్‌పీ దక్కటం లేదు. అలాంటప్పుడు…నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం మాటల్ని ఎలా నమ్ముతాం? రైతుల నుంచి కిలో బంగాళాదుంప రూ.2.5కి కొనుగోలు చేసిన కార్పొరేట్‌ సంస్థలు, పొటాటో చిప్స్‌ తయారుచేసి అదే కిలోమీద వందల రూపాయలు పొందుతున్నాయి.

దుష్ప్రచారానికి దిగిన కేంద్రం
ఢిల్లీ శివార్లలో రైతుల ఉద్యమం ఉధృతం కావటంతో..దీనిపై దుష్ప్రచారానికి మోడీ సర్కార్‌ తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలకులకు వంతపాడుతున్న మీడియా సంస్థలు రైతుల ఉద్యమాన్ని మరొకవిధంగా చూపుతున్నాయి. దీనిపై హర్యానాలోని హిసార్‌కు చెందిన రైతు సంఘం నాయకుడు సురేశ్‌ కౌత్‌ మాట్లాడుతూ..” విద్యార్థులు ఉద్యమం చేస్తే..’టుక్డే-టుక్డే గ్యాంగ్‌’ అన్నారు. ప్రజాస్వామ్య కార్యకర్తలపై జాతి వ్యతిరేకులన్న ముద్ర వేస్తున్నారు. నిరసనగళం వినిపిస్తున్న మేథావులపై ‘అర్బన్‌ నక్సల్స్‌’ ముద్రవేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై పాకిస్తానీలు అనే ముద్రవేశారు. ఇప్పుడు ఆందోళనకు దిగిన రైతులపైనా..’ఖలిస్తాన్‌’ అనే ముద్రవేయడానికి మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది” అని అన్నారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates