20 ఏళ్లలో ఏడోసారి ముఖ్యమంత్రి పీఠంపై నితీశ్‌కుమార్‌

Published on

  • వరుసగా నాలుగోసారి ప్రమాణం
  • బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీలు
  • గద్దె నితీశ్‌ది.. పెత్తనం బీజేపీది..?

పట్నా : బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం కావడం ఇది వరుసగా నాలుగోసారి. 20 ఏళ్లలో సీఎం పదవిని అలంకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి. మంత్రులుగా మరో 14 మంది ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీకి చెందిన తారాకిశోర్‌ ప్రసాద్‌, రేణూ దేవి ఉపముఖ్యమంత్రులు. బీజేపీ నుంచి మరో ఐదుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్డీయేలో ఇతర భాగస్వామ్యపక్షాలైన హెచ్‌ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులయ్యారు. వారి చేత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీని రాంవిలాస్‌ పాశ్వాన్‌ స్థానంలో రాజ్యసభకు నామినేట్‌ చేసి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కీలకమైన స్పీకర్‌ పదవి బీజేపీ సీనియర్‌ నేత నందకిశోర్‌ యాదవ్‌కు దక్కొచ్చని తెలుస్తోంది. అయితే, నితీశ్‌ పార్టీని బీజేపీ ఎంతకాలం బతకనిస్తుందన్నది చూడాలని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. నితీశ్‌ కాకలు తీరిన రాజకీయయోధుడే. అయినా.. ఇద్దరు కరడుగట్టిన సంఘ్‌ నేతలను డిప్యూటీలుగా చేసింది బీజేపీ! కేబినెట్లో సింహభాగం బీజేపీదే. స్పీకర్‌ పదవినీ తన వద్దే పెట్టుకుంది. ఇక నితీశ్‌ ఓటమికి కారణమైన చిరాగ్‌ పాశ్వాన్‌ను కమలం పార్టీ ఎలా  చూడనుందన్న విషయమూ కీలకం కానుంది. కాగా, బీజేపీకి రాష్ట్రవ్యాప్త ఇమేజ్‌ ఉన్న నేత లేరు. రానున్న రోజుల్లో శక్తిమంతమైన నాయకుడు బీజేపీకి కావాలి. సీఎం పీఠం నితీశ్‌దే అయినా బీజేపీదే పెత్తనం అనీ, బీజేపీని కాదని ఆయన ఏ పనీ చేయలేరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బీజేపీకి జేడీయూ అవసరమూ ఎక్కువే. ఆయనను కాదని వేరే పార్టీతో జట్టుకట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. భవిష్యత్తులో ఆర్జేడీని బీజేపీ చేరదీసినా ఆశ్చర్యంలేదని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో తేజస్వీ యాదవ్‌.. నితీశ్‌నే టార్గెట్‌ చేశారు. ప్రధాని మోదీ పట్ల మెత్తగానే వ్యవహరించారు. బిహార్‌ ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన తారాకిశోర్‌ ప్రసాద్‌ కతీహార్‌ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. రేణూదేవి గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. బెటియా నుంచి ఎన్నికైన ఆమె నితీశ్‌ గత కేబినెట్లో పనిచేశారు.

తేజస్వీ కంగ్రాట్స్‌.. బాయ్‌కాట్‌
మహాకూటమి నేత, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌.. నితీశ్‌ కుమార్‌కు వెటకారంగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘సీఎంగా ‘నామినేట్‌’ అయిన నితీశ్‌ కుమార్‌జీకి శుభాకాంక్షలు. ఆయన ఇకనైనా పదవిపై ఆశతో కాకుండా కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తారని, ఎన్డీయే మేనిఫెస్టో ప్రకారం 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తేజస్వీ బహిష్కరించారు. నితీశ్‌ పార్టీ ఓటమి కోసం శ్రమించిన లోక్‌జనశక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా హేళనగానే స్పందించారు. ‘‘సీఎం అయినందుకు కంగ్రాట్స్‌. మీరు పూర్తికాలం ‘ఎన్డీయే సీఎం’ గానే కొనసాగుతారని భావిస్తున్నా ను. మిమ్మల్ని సీఎం చేసిన బీజేపీకి కూడా అభినందనలు’’ అని చిరాగ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘సీఎం పదవి చేపట్టిన నితీశ్‌జీకి శుభాభినందనలు. బిహార్‌ ప్రగతికి ఎన్డీయే కుటుంబం కలిసి కృషి చేస్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైన సాయం అందిస్తాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Courtesy Andhrajyothi

Search

Latest Updates