నోముల నర్సింహయ్య హఠాన్మరణం

Published on

  • గుండెపోటుతో కన్నుమూత
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం
  • రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
  • హాజరు కానున్న ముఖ్యమంత్రి

నల్గొండ, హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, పార్కిన్సన్‌తో బాధపడుతున్నారు. 1999, 2004లో నకిరేకల్‌ నుంచి సీపీఎం పక్షాన శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో తెరాస తరఫున నాగార్జునసాగర్‌ నుంచి గెలుపొందారు. ఆయనకు భార్య సోమలక్ష్మి, కుమార్తెలు ఝాన్సీ, అరుణజ్యోతి, కుమారుడు భగత్‌కుమార్‌ ఉన్నారు. భగత్‌ ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె ఝాన్సీ ఆస్ట్రేలియాలో, చిన్న కుమార్తె అరుణజ్యోతి అమెరికాలో స్థిరపడ్డారు. 20 రోజుల క్రితమే పెద్ద కూతురు ఇక్కడికి వచ్చారు. బుధవారం సాయంత్రానికి చిన్న కూతురు స్వగ్రామానికి చేరుకోనున్నారు. నోముల భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా కొత్తపేటలోని ఆయన స్వగృహానికి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు తీసుకువచ్చారు. బుధవారం నకిరేకల్‌కి తరలిస్తారు. అక్కడినుంచి గురువారం నోముల స్వగ్రామమైన పాలెం తీసుకెళతారు. అదేరోజు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

వామపక్ష వాదిగా గుర్తింపు
నకిరేకల్‌ మండలం పాలెంలో 1956 జనవరి 9న జన్మించిన నర్సింహయ్య చిన్నతనం నుంచే మార్క్సిస్టు దృక్పథం అలవర్చుకున్నారు. కమ్యూనిస్టు దిగ్గజం నర్రా రాఘవరెడ్డి వద్ద శిష్యరికం చేశారు. 1987లో నకిరేకల్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. నకిరేకల్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో 1999లో అక్కడినుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి 2004లో అక్కడి నుంచే గెలిచారు. 2009లో భువనగిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారు. 35 ఏళ్లు సీపీఎంలో కొనసాగిన ఆయన 2014లో తెరాసలో చేరారు. అదే సంవత్సరం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డిపై నాగార్జునసాగర్‌లో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో తిరిగి అక్కడి నుంచే జానారెడ్డిపై అనూహ్య విజయం సాధించారు. రైతు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేగా, సీపీఎం శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమాలపై ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీలో సభ్యుడిగా కొనసాగారు.

సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
నర్సింహయ్య మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నోముల మరణం నియోజకవర్గ ప్రజలకు, తెరాస పార్టీకి తీరని లోటని అన్నారు. ప్రజల కోసం పనిచేసిన నాయకునిగా నిలిచిపోతారని సీఎం కొనియాడారు.

ప్రజాప్రతినిధుల సంతాపం
మంత్రి కేటీఆర్‌ విజయపురి కాలనీలో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి.. నర్సింహయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రులు ఈటల, సబితారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బాల్క సుమన్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఇతర ప్రముఖులు, వామపక్ష నాయకులు నర్సింహయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ప్రజాసమస్యలపై పోరు: చంద్రబాబు
నోముల ప్రజాసమస్యలపై అవిశ్రాంతంగా పోరాడారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డిలు సానుభూతి తెలిపారు.

దిగ్భ్రాంతికరం: కిషన్‌రెడ్డి
నర్సింహయ్య అకాల మరణం దిగ్భ్రాంతికరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. పేదల అభ్యున్నతికి పరితపించిన నాయకుడని కొనియాడారు. నోముల మరణం దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన చెందారు.

తీరనిలోటు: ఉత్తమ్‌
నోముల అకాల మరణం తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ తదితరులు విచారం వ్యక్తం చేశారు.

Courtesy Eenadu

Search

Latest Updates