ఊళ్లకు ఊర్లు ఉద్యమంలోకి..

Published on

అంతా తామై….
పంజాబ్‌లోని 3,500 గ్రామాల్లో కేవలం 10శాతం మాత్రమే పురుషులు

పటియాలా : ఆరుగాలం కష్టపడే అన్నదాత గోసను మోడీ సర్కార్‌ పెడచెవినపెడుతున్నది. ఆ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 18 రోజులకుపైగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఉద్యమం ఉధృతమవుతున్న కొద్దీ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరసనలపై నీళ్లు గుమ్మరించే యత్నాలకు పదనుపెడు తున్నది. మరోవైపు ఎత్తిన పిడికిలి దించకుండా.. అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందులో పంజాబ్‌లోని 12,797 గ్రామాలకు చెందిన పురుషులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో భాగమయ్యారు. ఇందులోని 3,500 గ్రామాలను పరిశీలిస్తే అక్కడ కేవలం పది శాతం మంది మాత్రమే పురుషులు ఉన్నారు. మిగిలిన సేద్యభారం, ఇంటిపనులన్నీ మహిళలే చక్కదిద్దుకుంటు న్నారు. పాటియాలాలోని దోణకాలాం ప్రాంతానికి చెందిన దల్జీత్‌ కౌర్‌ భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. రెండున్నర ఎకరాల పంటను అత్త, మామలు చూసుకుంటున్నారు. ఇపుడు వారు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో ఉన్నారు. ఇంటిపనితో పాటు రోజూ పొలానికి వెళ్లి పంటను కోడలు దల్జీత్‌ కౌర్‌ చూసుకుంటున్నారు. పొలానికి నీరు పెట్టడం, పశువులకు మేత వేయటం.. ఇలా అన్నీపనులూ తానై నడిపిస్తున్నది.

తన భర్త దేశ సేవలో ఉంటే.. మామ తనకున్న భూమిని కాపాడుకోవటానికి ఢిల్లీలో వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడని దల్జీత్‌ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేద్యాన్ని వదులుకోలేమని అన్నారు. వ్యవసాయమే మా బలం, ఈ చట్టాలు మళ్లీ మమ్మల్ని బానిసలుగా చేస్తాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

మేము సైతం…
– దౌన్‌ కలాన్‌ , ధరేయి జట్టా, చమరహేది, అలంపూర్‌, బోహద్పూర్‌ జాన్హేడితో సహా సమీప గ్రామాల్లోని మహిళలు సేద్యం పనులకు ఆటంకం కలగకుండా… ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.
– మోగా, సంగ్రూర్‌, మాన్సా, హౌసియపూర్‌, ఫాజిల్కా, పాటియాలా సహా రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి. ఉద్యమానికి ఎలాంటి విఘాతం కలగకుండా.. ఇంటి నుంచి రేషన్‌ ఇతర ఆహారపదార్థాలు తయారు చేసి ఢిల్లీకి చేరవేస్తున్నారు.

ఇష్టపడి ట్రాక్టర్‌ నేర్చుకుంటే..
– ఒక అభిరుచి కోసం ట్రాక్టర్‌ నడిపితే.. కొందరికి ఇపుడు అది అవసరంగా మారింది. ఉద్యమంలో పాల్గొనేందుకు 55 ఏండ్ల హర్జీత్‌ కౌర్‌… భర్త అవతార్‌, కొడుకును ఢిల్లీకి పంపారు. సాగు చేస్తున్న పదేకరాల వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా.. హర్జీత్‌ అన్నీ తానై నడిపిస్తున్నది. నేర్చుకున్న ట్రాక్టర్‌తో పొలాన్ని దున్ని.. సాగుకు అవసరమైన పనులన్నీ చేసుకుంటున్నది.

ప్రతి ఇంటి నుంచి ముగ్గురు..
– దేశం కోసం ఆనాడు ఉద్యమిస్తే… ఇప్పుడు తమ భూమిని కాపాడుకునేందుకు దాదాపు ప్రతీ ఇంటి నుంచీ ముగ్గురు చొప్పున ఢిల్లీకి వెళ్ళారు. సంగ్రూర్‌లోని సేఖువాస్‌ గ్రామానికి చెందిన మంజీత్‌ కౌర్‌తో పాటు అత్త, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అత్త, కొడుకును పొలానికి తీసుకెళ్లి… ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నట్టు మంజీత్‌ కౌర్‌ తెలిపారు. తనకు ఎలాంటి బెంగలేదనీ.. భర్త చేస్తున్న ఉద్యమానికి తగిన ఫలితం వస్తుందనే ఆశతో ఉన్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates