ఇక వచ్చేస్తున్నా..

Published on

  • ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు: రజనీకాంత్‌
  • కొత్త ఏడాదిలో పార్టీ స్థాపన
  • ఈ నెల 31న వివరాల ప్రకటన

చెన్నై:  ప్రముఖ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వచ్చే ఏడాది పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలను ఈ నెల 31వ తేదీన వెల్లడిస్తానని గురువారం ట్విటర్‌లో తెలిపారు. తమిళ ప్రజల కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు 2017 డిసెంబర్‌ 31న ప్రకటించిన రజనీకాంత్‌ ఇన్నాళ్ల ఉత్కంఠకు  గురువారం తెరదించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నీతి, నిజాయతీ, న్యాయంతో కూడిన కుల, మతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకనున్నట్లు ట్వీట్ చేశారు. ‘మారుద్దాం.. అన్నింటినీ మారుద్దాం.. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చోటుచేసుకుంటాయని అన్నారు. తలైవర్‌ పార్టీ ప్రారంభించడం తథ్యమని తెలియడంతో అభిమానులు అనేక జిల్లాల్లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు.

అనంతరం పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసం వద్ద రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ…. ప్రజల్లో చైతన్యం రావాలని, వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ ప్రారంభించాలని మార్చిలో లీలాప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వివరించారు. తదనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావించినా కరోనా కారణంగా పర్యటన వీలు కాలేదన్నారు. మూత్రపిండాల మార్పు కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువైందని.. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండాలని వైద్యులు సూచించారని రజనీ పేర్కొన్నారు. అందువల్ల ప్రజల్లోకి వెళ్లి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పడంతో తాను కొంత ఆలోచించినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో సింగపూర్‌లో చికిత్స చేసుకున్న సందర్భంలో ప్రజల ప్రార్థనల వల్లే తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ‘‘మార్చాలి, అన్నింటినీ మార్చాలి. అందుకు నేనో సాధనం మాత్రమే. నేను గెలిస్తే అది ప్రజల గెలుపు. ఓడిపోయినా అది ప్రజల ఓటమే’’ అని వ్యాఖ్యానించారు.

ఇద్దరు బాధ్యుల నియామకం
తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నాటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న తమిళరువి మణియన్‌ను పార్టీ పర్యవేక్షకుడిగా నియమిస్తున్నట్లు రజనీ తెలిపారు. అర్జునన్‌మూర్తిని పార్టీ ప్రధాన సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

Courtesy Eenadu

Search

Latest Updates