దారుణంగా పడిపోయిన ఉపాధి కల్పన

Published on

– జాతీయ పెన్షన్‌ స్కీం పేరోల్‌ డేటా ప్రకారం..

న్యూఢిల్లీ : అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఓపక్క.. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర సర్కార్‌ తెగనమ్ముతుంటే ఉన్న ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడుతున్నది. మరోవైపు ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్‌ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. జాతీయ పెన్షన్‌ స్కీం పేరోల్‌ డేటా ప్రకారం… ఆగస్టుతో పోలి స్తే సెప్టెంబరులో ఉద్యోగాల కల్పన మరింత పడిపోయింది. ఆగస్టులో కేంద్రం, రాష్ట్రాలు కలిపి 32,429 ఉద్యోగాలను సృష్టించాయి. సెప్టెంబరు నాటికి ఈ సంఖ్య 8.4శాతం తగ్గి 29,697కు చేరింది. ఇందులో కేంద్ర సహకారంతోపాటు, రాష్ట్రాల స్థాయిలో కొత్త ఉద్యోగాలు నెలకు 9.7శాతం పడిపో యాయి. ఆగస్టులో రాష్ట్రాల ఉద్యోగాల సృష్టి 26,084 నుంచి సెప్టెంబరులో ఆ సంఖ్య 23,559గా నమోదైనట్టు పేరోల్‌ గణాంకాల్లో తేలింది. ‘ఈ ఆర్థిక సంవ త్సరంలో మే నుంచి కేంద్ర స్థాయిలో ప్రభు త్వ ఉద్యోగాల కల్పన పెరిగింది. అయితే సెప్టెంబరులో అది మరింత పడిపో యింది, కొత్త ఉద్యోగాలు సష్టించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతోనే ఇది జరిగింది’ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.

‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులూ మెరుగైన స్థాయిలో లేవు. వ్యాపా రాలపై మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీంతో ప్రభుత్వాల ఆదాయాలూ పడిపోయాయి. కొత్త నియామకాలపై రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కొత్త కొలువులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో చేసిన ప్రకటన రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది’ అని ఆర్థికవేత్త కె.ఆర్‌. శ్యామ్‌సుందర్‌ అన్నారు. ‘జీఎస్టీ (వస్తువులు సేవల పన్ను) సేకరణ సెప్టెంబరుతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నది. మరికొన్ని నెలల వరకూ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇదే పరిస్థితి ఉండొచ్చు’ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో కాంట్రాక్టు ఉద్యోగాల దిశగా అడుగులను వేగవంతం చేశాయని ఇండియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌ చంద్‌ తెలిపారు. ‘శాశ్వత ఉద్యోగాల స్థానంలో.. అధికారులు స్వల్పకాలిక కాంట్రాక్ట్‌ పని, ఔట్‌సోర్సింగ్‌పైనే ఆధారపడుతున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో తక్కువ వేతనంతో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అగ్రశ్రేణి అధికారులకు సహాయక సిబ్బందికి కూడా ప్రయివేటుపైనే ఆధారపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు’అని చంద్‌ అన్నారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates