గ్రేటర్‌ వార్‌లో సోషల్‌ ఆర్మీ

Published on

  • దుబ్బాక విజయం తర్వాత అన్ని పార్టీలూ అదే బాట
  • ఇప్పటికే దూసుకెళ్తున్న కమలనాథులు
  • టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రచారం ముమ్మరం
  • సమయం తక్కువ ఉండడంతో దీనిపైనే దృష్టి
  • పార్టీలు, అభ్యర్థులు లక్ష్యంగా కంటెంట్‌ తయారీ
  • రైటర్ల నియామకం.. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు
  • తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకునే యత్నం

తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే, అక్బర్‌, బాబర్‌ వారసుడు కేసీఆర్‌ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. దాంతో, అమిత్‌ షా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ ముస్లిం నేతలను కలిసిన.. ముస్లింలతో ఇఫ్తార్‌ విందులు చేస్తున్న ఫొటోలను టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. సంజయన్నా ఏమిటిది? అంటూ ప్రశ్నిస్తున్నారు.

వరద సాయం మీద బీజేపీ బురద రాజకీయం చేస్తోంది. పేదలకు ఇస్తున్న రూ.10 వేలు వెంటనే ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ కారణంగానే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందని కేసీఆర్‌ ఆర్మీ ఫేస్‌బుక్‌ ఖాతాలో వైరల్‌ చేస్తున్నారు.

26,00,000  ట్విటర్‌లో కేటీఆర్‌ ఫాలోయర్స్‌

1,24,000  ట్విటర్‌లో బండి సంజయ్‌ ఫాలోయర్స్‌ 

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌  హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా వార్‌కు తెరలేచింది. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా సోషల్‌ మీడియాలో బీజేపీదే పైచేయి. అందుకే, ‘బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తారు. జనంలో కనిపించరు’ అని ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా ఎద్దేవా చేశారు. కానీ, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు టీఆర్‌ఎస్‌ కూడా సోషల్‌ మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నిజానికి, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సోషల్‌ మీడియానే ఎక్కువగా వినియోగించుకుని ఓటర్లను ఆకట్టుకుంది. యువతను ఆకట్టుకునే సందేశాలు, హుషారెత్తించే పాటలను ఆ పార్టీ తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు, యూట్యూబ్‌ చానళ్లలో వైరల్‌ చేసింది. బీజేపీ విజయానికి సోషల్‌ మీడియా ప్రచారం కారణమనే వ్యాఖ్యానాలూ వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలోనే, ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో ఆయా పార్టీలు ‘సోషల్‌’ సైన్యాలను పెంచేశాయి. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో టీఆర్‌ఎ్‌సకు టీఆర్‌ఎస్‌ పొలిటికల్‌, టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ ఆర్మీ, హరీశ్‌ అన్న సైన్యం, తెలంగాణ జాగృతి తదితర  ఖాతాలున్నాయి. వీటితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఖాతాలు సరేసరి. ఇప్పుడు వీటి సంఖ్యను కూడా భారీగా పెంచేశారు. ఇక, బీజేపీలో తెలంగాణ బీజేపీ, బండి సంజయ్‌, అర్వింద్‌ సైన్యం, కాషాయ దళంతోపాటు మరికొన్ని అకౌంట్లు కొనసాగుతున్నాయి.

కాంగ్రె్‌సకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ హైదరాబాద్‌, రేవంత్‌ సైన్యం; మజ్లి్‌సకు ఎంఐఎం తెలంగాణ, ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ ఖాతాలున్నాయి. ఇప్పుడు ఇతర పార్టీలు కూడా తమ సోషల్‌ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని వర్గాల ఓటర్లను కలుసుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో 60 నుంచి 70 వేల మందికిపైగా ఓటర్లు ఉండడంతో అందరినీ కలిసేందుకు సమయం సరిపోయే పరిస్థితి లేదు. దాంతో, అన్ని పార్టీలూ సోషల్‌ మీడియా వేదికగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థుల పేరిట కొత్త అకౌంట్లనూ ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా, టీఆర్‌ఎస్‌ నాయకులు దట్టీలు కట్టుకుని తిరుగుతారని నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యానించారు. దాంతో, ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత రఘునందన్‌ దట్టీ కట్టుకున్న ఫొటోను టీఆర్‌ఆర్‌ కార్యకర్తలు వైరల్‌ చేస్తున్నారు.

‘‘వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయంపై టీఆర్‌ఎస్‌ కొత్త డ్రామా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ బండి సంజయ్‌ కుమార్‌ పేరుతో ఫోర్జరీ లెటర్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వైనం. ఓటమి భయంతో ఫేక్‌ లెటర్లు, అసత్యపు వార్తలతో కుట్రలకు తెరలేపిన టీఆర్‌ఎస్‌ జలగలు’’ అంటూ బండి సంజయ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో వైరల్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ భగీరథ మంచినీళ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామంటూ కేసీఆర్‌ అన్న మాటలను.. తమకు మంచి నీళ్లు అందడం లేదంటూ బస్తీవాసులు చేస్తున్న వ్యాఖ్యలను పక్కపక్కన పెట్టి బీజేపీ వాట్సా్‌పలో ’2016 ఎన్నికల ముందు, 2020 ప్రస్తుతం’ పేరిట ప్రచారం చేస్తోంది.

హైదరాబాద్‌ ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? అంటూ పల్స్‌ ఆఫ్‌ తెలంగాణ ఆన్‌లైన్లో చేసిన సర్వేకు టీఆర్‌ఎస్‌ 8ు, కాంగ్రెస్‌ 21ు, టీడీపీ 71ు ఫలితం వచ్చిన ఫొటోను టీడీపీ వైరల్‌ చేస్తోంది. ‘అకౌంట్లో 15 లక్షలు పడిన వాళ్లంతా బీజేపీకి ఓటు వేయండి. ఇంటికో ఉద్యోగం వచ్చిన వాళ్లంతా టీఆర్‌ఎ్‌సకే ఓటు వేయండి. భాగ్య నగరం మరలా బాగుండాలని కోరుకునే వాళ్లంతా టీడీపీకే ఓటు వేయండి’ అని కూడా వాట్సాప్‌ ప్రచారం చేస్తోంది.

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగం
లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పలను కొనుగోలు చేశారు. పాఠశాలలు, కళాశాలలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేశారు. గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న సుమారు 1.30 కోట్ల జనాభాలో 78 లక్షల మంది వరకు స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు ఓ అంచనా. దాంతో, దాదాపు అన్ని పార్టీలూ సోషల్‌ మీడియానే తమ ప్రచార వేదికగా మార్చుకుంటున్నాయి.

తమ మదిలో మెదిలిన ఆలోచనలకు మరింత పదును పెట్టి ప్రజలను ఆకట్టుకునే విధంగా చక్కని భాషలో పదాలను అర్థవంతంగా రాసేందుకు 20 రోజులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఇచ్చి కంటెంట్‌ రైటర్లను నియమించుకుంటున్నారు. వీటితోపాటు పార్టీల పరంగా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, అభ్యర్థి గుణగణాలు, ప్రచార కార్యక్రమాలు, జనాదరణను పోస్ట్‌ చేస్తున్నారు.

ఇటీవల ఓటుహక్కు పొందిన ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఎదుటి పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను కంటెంట్‌ రైటర్లు ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో సోషల్‌ మీడియాలో ‘గ్రేటర్‌’ వార్‌ కళ్లెదుటే కనిపిస్తోంది.

ముఖ్య నాయకుల ఫాలోవర్స్‌ (సోషల్‌ మీడియా ఖాతాల్లో)
నాయకుడు ట్విటర్‌ ఫేస్‌బుక్‌
కేటీఆర్‌ (టీఆర్‌ఎస్‌) 2.6 మిలియన్లు 10 లక్షలు
బండి సంజయ్‌ (బీజేపీ) 1.24 లక్షలు 1.61 లక్షలు
రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌) 1.75 లక్షలు 6.0 లక్షలు
అసదుద్దీన్‌ 1.6 మిలియన్లు 34 లక్షలు

పార్టీలవారీగా ఫాలోవర్స్‌ (వివిధ సోషల్‌ మీడియా ఖాతాల్లో)
టీఆర్‌ఎస్‌ 5.29 లక్షలు 11 లక్షలు
బీజేపీ తెలంగాణ 1.05 లక్షలు 3.43 లక్షలు
తెలంగాణ కాంగ్రెస్‌ 75 వేలు 2.34 లక్షలు
ఎంఐఎం 51 వేలు 8.47 లక్షలు

Courtesy Andhrajyothi

Search

Latest Updates