సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

Published on

వారాల ఆనంద్

సౌమిత్ర కేవలం సినీరంగంపై మాత్రమే కాదు, నాటకరంగం మీద కూడా తన ముద్ర వేశారు. ‘ఎక్కోన్’ అనే సాహిత్య పత్రికకు సహసంపాదకుడిగా 18ఏళ్ళు పని చేశారు. కవిగా పన్నెండు కవితా సంకలనాలు వెలువరించారు. అనేక మంచి పెయింటింగ్‌లు వేశారు. ప్రగతిశీల భావాలతో సమాంతర రాజకీయాలపై ప్రతిస్పందించారు. ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. 

‘మనమంతా బతకడానికి డబ్బు సంపాదిస్తాం, కానీ శ్వాసకూ జీవితానికీ అవతలి వైపు కూడా ఆలోచించాలి. లేకుంటే మన ఉనికి ఆత్మలేనిది అవుతుంది’ అన్న మాటలపై విశ్వాసం ఉన్న గొప్ప నటుడు సౌమిత్ర చటర్జీ. భారతీయ కళాత్మక సినిమాలకు మహావృక్షం లాంటి సత్యజిత్ రే నుంచి ఎదిగిన ఒక శాఖ ఆయన. 1959లో రే ‘అపూర్ సంసార్’ సినిమాతో ఆరంభమయిన సౌమిత్ర చటర్జీ ప్రయాణం ఆయనతో 14 ఫీచర్ సినిమాలు, ఒక షార్ట్ ఫిలిం దాకా సాగింది. అందుకే సౌమిత్ర చటర్జీ అనగానే మరుక్షణం సత్యజిత్ రే గుర్తుకొస్తారు. ‘అపూర్ సంసార్’, ‘చారులత’ సినిమాలు మన ముందు కదలాడతాయి. పాత్ర ఎంత సులభమైనదయినా ఎంత సంక్లిష్టమైనదయినా ఆ పాత్రలోకి రూపాంతరం చెందడం సౌమిత్ర చటర్జీ మౌలిక లక్షణం. అంతేకాదు, తన పాత్ర పోషణలో సరైన టైమింగ్‌ను పాటించడంలో, ఆయా పాత్రల మనోభావాల్ని పలికించడంలో ఆయనది విలక్షణమైన సరళి. రచయిత రూపొందించిన పాత్రకు దర్శకుడు ఆశించిన రీతిలో వ్యక్తీకరణలను ప్రకటించడం, అందుకు తగ్గ స్వర మాడ్యులేషన్‌ని పలికించడంలో చటర్జీ ప్రతిభ సహజంగా ఉండి ఎలాంటి మెలోడ్రామాకు తావు లేకుండా ఉంటుంది. అది ఆయన విశిష్టత.

‘సౌమిత్ర చటర్జీ అంగసౌష్టవం యవ్వనంలో ఉన్నప్పటి రవీంద్రనాథ్ టాగోర్‌ను పోలిఉండడంతో సత్యజిత్ రే ఆయనను అన్ని సినిమాల్లోకి తీసుకున్నాడని’ సుప్రసిద్ధ సినీ విమర్శకుడు చిదానంద దాస్ గుప్తా తన ‘టాకింగ్ అబౌట్ ఫిలిం’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. అంతే కాదు, అమాయకత్వాన్ని ప్రతిబింబించే ముఖంతో పాటు పెద్దరికాన్ని గాంభీర్యాన్నీ ఏకబిగిన పలికించగలిగిన కళ్ళు, పాత్రకు తగ్గట్టుగా సులభంగా మలుచుకోగలిగిన శరీర లక్షణం నటుడిగా ఆయన గొప్ప విజయం సాధించడానికి దోహదపడ్డాయి. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సౌమిత్ర సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ‘జల్ సాగర్’ చిత్రం సెట్స్‌కి వెళ్ళాడు. అతణ్ణి చూసిన రే తన తర్వాతి సినిమాలో ఇతడే ప్రధాన పాత్రధారి అని ప్రకటించడంతో సౌమిత్ర చటర్జీతో సహా అంతా ఆశ్చర్యపోయారు. అట్లా మొదలయిన ఆయన నటజీవితం మొన్నటివరకు అవిశ్రాంతంగా సాగింది.

సౌమిత్ర చటర్జీ బాల్యం కృష్ణానగర్‌లో గడిచింది. అనంతరం సౌమిత్ర తండ్రి కలకత్తా హైకోర్ట్‌లో న్యాయవాద వృత్తిలో ఉండడంతో కలకత్తా చేరు కున్న సౌమిత్ర బెంగాలి సాహిత్యంలో పీజీ కోర్సులో చేరారు. అక్కడే నాటక రంగ ప్రముఖుడు అహింద్ర చౌధురి వద్ద నట మెళకువల్ని నేర్చుకున్నారు. ఆ కాలంలోనే రే సౌమిత్రలో ఉన్న ప్రతిభను కనిపెట్టారు. ఆ తర్వాతి కాలంలో చటర్జీ పోషించిన పాత్రలు ఉత్తమ సినిమాలను ఆదరించే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కెరీర్ తొలి రోజుల్లోనే అపు, అమూల్య (‘సమాప్తి’), నర్సింగ్ (‘అభిజాన్’) పాత్రల్ని తనలో అంతర్లీనం చేసుకున్న తీరు అబ్బురపరుస్తుంది. ఇక రే క్లాసిక్ ‘చారులత’ సినిమాతో ఆయన బెంగాలీ చేతి రాతనే మార్చేశారు. తన 27 ఏళ్ల వయసులో ఆరు నెలలు కష్టపడి టాగోర్‌కు ముందుకాలం నాటి బెంగాలీ అక్షరాల తీరును అభ్యసించి నటించారు ఆ సినిమాలో. రే సినిమాలు ‘హిరక్ రాజర్ దేశాయ్’, ‘ఘరె భైరే’, ‘ఘన శత్రు’, ‘శాఖ ప్రశాఖ’ సినిమాల్లో సౌమిత్ర చటర్జీ నటన రే ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచిపోతుంది.

సౌమిత్ర చటర్జీ రే తో పాటు మృణాల్‌సేన్ తో ‘ఆకాష్ కుసుం’, తపన్‌సిన్హాతో ‘జిందర్ బండి’, ‘లాంరి’ సినిమాల్లో నటించారు. ఇక రాజ మిత్ర లాంటి యువ దర్శకుడితో ‘ఎక్తీ జుబాన్’లో నటించారు. గౌతం ఘోష్ రూపొందించిన ‘దేఖా’ సినిమాలో ఓ మేధావి పాత్రను పోషించారు. ఆయన నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే ‘కాపురుష్’, ‘ఆకాష్ కుసుమ’, ‘అరణఎర్ దిన్ రాత్రి’, ‘ఆశని సంకేత్’, ‘గణ దేవత’, ‘కొని’, ‘మహా పృథ్వీ’ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలున్నాయి. 80ల తర్వాత సౌమిత్ర అపర్ణ సేన్, అంజన్ దాస్, రితుపర్ణ ఘోష్ లాంటి యువ దర్శకులతో ఆయన పని చేశారు.

సత్యజిత్ రే, సౌమిత్ర చటర్జీ ద్వయం భారతీయ సినిమాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలిపింది. సౌమిత్ర కేవలం సినీరంగంలో మాత్రమే కాదు, నాటక రంగం, కవిత్వం, ఆర్ట్, ప్రచురణ రంగాల్లో కూడా తన విశిష్టతను చాటుకున్నారు. ఎక్కోన్ అనే సాహిత్య పత్రికకు సహసంపాదకుడిగా 18 ఏళ్ళు పని చేశారు. కవిగా పన్నెండు కవితా సంకలనాలు వెలువరించారు. అనేక మంచి పెయింటింగ్‌లు వేశారు. పగతిశీల భావాలతో సమాంతర రాజకీయాలపై ప్రతిస్పందించారు. ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలిపారు. ఆయనకు పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక జాతీయ అవార్డులు లభించాయి. ఆయన మరణం బెంగాలీ సినిమాకే కాదు మొత్తం భారతీయ సినిమాకే పూడ్చలేని లోటు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Search

Latest Updates