కొవిడ్‌కు సరికొత్త చికిత్స

Published on

కనుగొన్న తెలుగుతేజం తిరుమల దేవి

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 బాధితుల్లో ప్రాణాంతక ఇన్‌ఫ్లమేషన్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవ వైఫల్యం వంటి వాటిని నివారించడానికి భారత అమెరికన్‌ శాస్త్రవేత్త, తెలుగు తేజం తిరుమల దేవి కన్నెగంటి సరికొత్త చికిత్స మార్గాన్ని కనుగొన్నారు. కరోనా సోకినవారిలో ‘ఇన్‌ఫ్లమేటరీ కణ మరణం’ అనే ప్రక్రియ సంభవిస్తున్న తీరును ఆమె గుర్తించారు. దాన్ని విచ్ఛిన్నం చేసే చికిత్సలను కనుగొన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల బాధితుల్లో అనేకరకాల సైటోకైన్లు విడుదలవుతాయి. ఈ చిన్నపాటి ప్రొటీన్లను ప్రధానంగా రోగనిరోధక కణాలు వెలువరిస్తాయి. వైరస్‌ను వేగంగా కట్టడి చేయడం వీటి ఉద్దేశం. అయితే కొన్ని సైటోకైన్లు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌)ను కలిగిస్తాయి. రక్తంలో నాటకీయంగా సైటోకైన్‌ స్థాయి పెరగడంతోపాటు రోగనిరోధక వ్యవస్థలో మార్పులు జరిగి ‘సైటోకైన్‌ తుపాను’ కూడా సంభవిస్తుంది. ఈ ‘తుపాను’, ఆ తర్వాత జరిగే ఇన్‌ఫ్లమేషన్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవ వైఫల్యానికి దారితీసే నిర్దిష్ట చర్యాక్రమం గురించి శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో తిరుమల దేవి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై  పరిశోధనలు సాగించింది. కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా విడుదలవుతున్న కొన్ని సైటోకైన్లపై దృష్టిసారించింది. టీఎన్‌ఎఫ్‌-ఆల్ఫా, ఐఎఫ్‌ఎన్‌-గామా అనే సైటోకైన్ల ద్వారా కలిగే ‘ఇన్‌ఫ్లమేటరీ కణ మరణ ప్రక్రియ’కు కొవిడ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు ఎలుకలపై పరిశోధనల ద్వారా తేల్చారు. ఇవి కణ మరణ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా బహుళ అవయవ వైఫల్యానికి కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు ఈ సైటోకైన్లను లక్ష్యంగా చేసుకునే ఔషధాల ద్వారా కొవిడ్‌-19 బాధితులకే కాకుండా, సదరు ‘తుపాను’ తలెత్తే ఇతర రుగ్మతలనూ నయం చేయవచ్చని తిరుమల దేవి పేర్కొన్నారు. క్రాన్స్‌ రుగ్మత, కొలైటిస్‌ వంటి వ్యాధుల చికిత్సకు వాడే మందులు ఇందుకు పనికొస్తాయని తేల్చారు.

తెలంగాణలో జన్మించిన తిరుమల దేవి.. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఎస్సీ, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. 2007 నుంచి అమెరికాలోని టెన్నెసీ రాష్ట్ర మెంఫిస్‌ నగరంలో ఉన్న సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. అక్కడి ఇమ్యునాలజీ విభాగానికి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా పరిశోధనలో ఆర్‌.కె.సుబ్బారావు మలిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Courtesy Eenadu

Search

Latest Updates