వరవరరావు పరిస్థితి విషమం

Published on

  • దాదాపు మరణశయ్యపై ఉన్నారు
  • నానావతి ఆస్పత్రిలో చేర్చండి
  • వెంట భార్యనూ అనుమతించండి
  • ఆయనకు అన్ని పరీక్షలూ జరపాలి
  • బాంబే హైకోర్టు ఆదేశాలు

ముంబై : విరసం నేత, హక్కుల కార్యకర్త వరవరరావును జైలు నుంచి తక్షణం నానావతి ఆసుపత్రికి  తరలించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా మరణశయ్యపై ఉన్నారు. ఆయనకు నరాల సంబంధమైన ఇబ్బందులున్నాయి. ఈ ఏడాది జూలైలో ఆయనకు కరోనా సోకింది. కొవిడ్‌ అనంతర జాగ్రత్తలూ తీసుకోవాలి. ఆయన 81 ఏళ్ల మనిషి. తీవ్రమైన వ్యాధి ఉంది. ఆయనకు అత్యవసర చికిత్స, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఇప్పటికీ ఆయనను తలోజా జైల్లోనే ఉంచాలా? ఆస్పత్రికి తరలిస్తే మీకు అభ్యంతరమేంటి? ఆయన ఆసుపత్రి ఖర్చునంతా ప్రభుత్వమే భరించాలి. భార్య ఆయనను కలిసేందుకు, ఆస్పత్రిలో ఉండేందుకు అనుమతించాలి. మాకు చెప్పకుండా డిశ్చార్జి చేయొద్దు. మెడికల్‌ రిపోర్టులు మాకు సమర్పించాలి’’ అని జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, జస్టిస్‌ మాధవ్‌ జామ్‌దార్‌ల బెంచ్‌ ఆదేశించింది. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నుంచి సూచనలు తీసుకున్నానని, ఆయనను ఓ ప్రత్యేక కేసుగా పరిగణించి ఆస్పత్రికి తరలించడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ లాయర్‌ దీపక్‌ ఠాక్రే కోర్టుకు తెలిపారు. ఎన్‌ఐఏ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ మాత్రం వరవరరావును ప్రభుత్వాస్పత్రి అయిన జేజే హాస్పిటల్‌కు తరలిస్తే సరిపోతుందని, అక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నాయని వాదించారు. తొలుత ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వం, ఎన్‌ఐఏ ఇష్టపడలేదు.

వరవరరావు మెడికల్‌ రిపోర్టులు, ఆయన తరఫు వాదనలు విన్నాక బెంచ్‌ ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించాలని, అయినా ఆయన ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉంటారని బెంచ్‌ ఆదేశించింది. ప్రస్తుతానికి బెయిల్‌ గురించి పట్టుబట్టవద్దని, తరువాత చూద్దామని అంటూ కేసును డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2018 జూన్‌ 18న ఎన్‌ఐఏ వరవరరావును అరెస్టు చేసింది. 2017 డిసెంబరు 31 రాత్రి పుణెలో ఎల్గార్‌ పరిషత్‌ సదస్సులో పాల్గొన్నందుకు ఆయనను, మరికొందరు హక్కుల నేతలను అరెస్ట్‌ చేశారు. వీరికి నక్సల్స్‌తో సంబంధాలున్నాయన్నది ఆరోపణ.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates