బంద్‌కు భారీ మద్దతు

Published on

  • రైతుల రేపటి ఆందోళనకు 14 పార్టీల బాసట
  • కార్మిక, బ్యాంకు ఉద్యోగ సంఘాల సంఘీభావం
  • ప్రజలంతా సహకరించాలని ఏఐకేఎస్‌సీసీ పిలుపు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం మంగళవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఈ ఆందోళనలో తాము కూడా పాల్గొంటున్నట్లు 14 రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రకటించాయి. బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. బంద్‌కు సమస్త ప్రజానీకం సహకరించాలని ‘అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి’ (ఏఐకేఎస్‌సీసీ) పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం సింఘు సరిహద్దులో జరిగిన విలేకర్ల సమావేశంలో సమన్వయ సమితి నేతలు మాట్లాడారు. అత్యవసర సేవలు, అంబులెన్సులు, వివాహాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నామని స్పష్టంచేశారు. గుజరాత్‌ నుంచి 250 మంది రైతులు దిల్లీకి వచ్చి ఆందోళనలో పాల్గొంటారని చెప్పారు.

కాంగ్రెస్‌, మిత్రపక్షాల మద్దతు
కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, ఆప్‌, శివసేన, తెరాస సహా 14 పార్టీలు రైతుల బంద్‌కు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల తరఫున సీపీఎం ప్రధాన కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘కేంద్రం పార్లమెంటులో నిర్మాణాత్మకమైన చర్చ, ఓటింగ్‌ నిర్వహించకుండా ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఆమోదించి, దేశ ఆహార భద్రతకు ముప్పు తలపెట్టింది. కనీస మద్దతు ధరను రద్దు చేయడం ద్వారా రైతులను నాశనం చేసి మొత్తం వ్యవసాయ రంగాన్ని, మార్కెట్లను కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు కట్టుబడి రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి’’ అని ఈ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సంయుక్త ప్రకటనపై సంతకం చేసినవారిలో సోనియాగాంధీ, శరద్‌పవార్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, ఎం.కె.స్టాలిన్‌, ఫరూక్‌ అబ్దుల్లా ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నైతిక మద్దతు ప్రకటించింది. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ పలు బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. వీలైనంత త్వరగా చర్చలు జరిపి.. వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా ఫలవంతమైన చర్చలు జరపాలని ‘అఖిల భారత బ్యాంక్‌ అధికారుల సంఘం’ (ఏఐబీఓఏ), ‘భారత జాతీయ బ్యాంక్‌ అధికారుల కాంగ్రెస్‌’ (ఐఎన్‌బీఓసీ) సూచించాయి.

ఖేల్‌రత్న వెనక్కి ఇస్తా: విజేందర్‌
చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోతే ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని బాక్సర్‌ విజేందర్‌సింగ్‌ ప్రకటించారు. ఆదివారం సింఘూ సరిహద్దువద్ద ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు.

కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే..
వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ రంగం విస్తరించాలని కేంద్రం కోరుకుంటోంది. దానివల్ల కార్పొరేట్‌ సంస్థలు భారీగా లాభపడి రైతులు నాశనమైపోతారు. ప్రభుత్వం రైతులతో చర్చలను సాగదీస్తోంది. చట్టాల రద్దు మినహా మరో డిమాండ్‌ లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. వ్యాపార సంఘాలు, పారిశ్రామిక- కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఇతర కార్మిక సంఘాలు బంద్‌ను విజయవంతం చేయడానికి ముందుకొచ్చాయి. బంద్‌ సందర్భంగా ర్యాలీలు, ధర్నాలు ఉంటాయి. రాష్ట్రాల రాజధానుల్లో భారీ ప్రదర్శనలు ఉంటాయి.

అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి

Courtesy Eenadu

 

Search

Latest Updates