అత్యంత సంపన్న మహిళ రోష్ని నాడార్‌

Published on

  • రెండు, మూడు స్థానాల్లో కిరణ్‌ మజుందార్‌ షా, లీనా గాంధీ తివారీ
  • తెలుగు రాష్ట్రాల్లో 13 మంది
  • కోటక్‌- హురున్‌ ఇండియా జాబితా

హైదరాబాద్‌ : రోష్ని నాడార్‌, కిరణ్‌ మజుందార్‌ షా, లీనా గాంధీ తివారి… హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బయోకాన్‌, యూఎస్‌వీ ఛైర్‌పర్సన్లు అయిన ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు కోటక్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘కోటక్‌ వెల్త్‌ హురున్‌ – లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ నివేదికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. రోష్ని నాడార్‌ సంపద రూ. 54,850 కోట్లు కాగా, కిరణ్‌ మజుందార్‌ షా సంపద రూ.36,600 కోట్లు, లీనా గాంధీ తివారీ సంపద రూ.21,340 కోట్లు అని ఈ నివేదిక తేల్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాను కోటక్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా గురువారం వెల్లడించాయి. ఈ నివేదిక తయారీలో కుటుంబ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిగణనలోకి తీసుకున్నారు.

ధనిక మహిళల్లోని మొదటి 100 మంది సగటు సంపద రూ.2,725 కోట్లుగా ఉంది. ఇందులో 13 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వారు. ఇందులో దివీస్‌ లేబొరేటరీస్‌ డైరెక్టర్‌ నీలిమ మోటపర్తి అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ.18,620 కోట్లు. ఆ తర్వాత స్థానంలో రూ.4,100 కోట్ల సంపదతో బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 32 ఏళ్ల అంజనా రెడ్డి (యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌) ఈ జాబితాలో స్థానం సంపాదించటం ప్రత్యేకత. అత్యంత ధనిక మహిళల్లో ఎక్కువ మంది ముంబయిలో ఉన్నారు. ఆ తర్వాత దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన వారికి ఈ జాబితాలో స్థానం లభించింది.

మనదేశంలో సంపద సృష్టిలో గత రెండు దశాబ్దాల్లో మహిళల పాత్ర విస్తృతం అయినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ దాస్‌ పేర్కొన్నారు. 2020- కోటక్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా సంపన్న మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విజయగాథగా ఆయన అభివర్ణించారు. ఈ జాబితా చూసి ఎంతోమంది మహిళలు ఉత్తేజితులై మరింతగా ఎదగడానికి, సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారనే ఆశాభావాన్ని హురున్‌ ఇండియా ఎండీ అనస్‌ రెహ్‌మాన్‌ అభిప్రాయపడ్డారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates