ప్రపంచపు తొలి మార్క్సిస్టు

Published on

సీతారాం ఏచూరి, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శ్యి

నవంబరు 28, 2020 ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ ద్వి శత జయంతి. ఈ కరోనా మహమ్మారి విజృంభణ, దాని పర్యవసానంగా మనం తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ నిబంధనలు మనకు పరిమితులు విధించాయి గాని లేకుంటే 2018-19లో మార్క్స్‌ ద్విశత జయంతిని ఏవిధంగా ఘనంగా నిర్వహించామో, అదే విధంగా ఇప్పుడూ నిర్వహించవలసిన సందర్భం ఇది.

మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని ఆవిష్కరించడంలో, దానిని విశదీకరించడంలో ఎంగెల్స్‌ పాత్ర, సైద్ధాంతిక కృషి అత్యంత ప్రాధాన్యత కలిగివుంది. గతితార్కిక పద్ధతి వ్యక్తమైన తీరును, విశ్వంలో సమస్త భౌతిక పరిణామ క్రమానికి వర్తించే నియమాలను, జీవ పరిణామ క్రమాన్ని, మానవ సమాజ పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకోడానికి, వాటి లోని గతి తర్కాన్ని గుర్తించడానికి ఎంగెల్స్‌ సైద్ధాంతిక కృషి ఎంతగానో తోడ్పడుతుంది. నిజానికి ఎంగెల్స్‌ రచనలను, మానవ మేధ, దార్శనికత, నాగరికతల పురోగమనంలో ఎంగెల్స్‌ పోషించిన సృజనాత్మక పాత్రను తిరిగి అధ్యయనం చేయవలసిన తరుణం ఇది. ఏదో ఒక్క వ్యాసంలోనే దీనినంతా వివరించడం అసాధ్యం. ప్రస్తుత పరిమితులెలా ఉన్నా, పార్టీ ఈ అంశాలన్నింటి పైనా రానున్న ఏడాది పొడవునా కార్యక్రమాలను చేపడుతుంది.

నేను ప్రస్తుతం ఒక ప్రధాన అంశాన్ని మాత్రం చర్చిస్తాను. ఆచరణను, సిద్ధాంతాన్ని గతితార్కికంగా మేళవించే ఒక ఆలోచనా విధానంగా మార్క్సిజానికి ఆ పేరు కార్ల్‌ మార్క్స్‌ నుండి వచ్చింది. అయితే ఈ విషయంలో ఎంగెల్స్‌ నిర్వహించినది అంత ప్రధానమైన పాత్ర కాదనే అభిప్రాయం తరుచుగా వ్యక్తమౌతూ వుంటుంది. ఇది చాలా, చాలా పొరపాటు అభిప్రాయం అనే చెప్పాలి. తన రచనలలో పాదార్ధిక, సామాజిక జీవితం లోని అన్ని అంశాల లోనూ గతితర్కాన్ని ఆవిష్కరించిన తీరును చూస్తే ఎంగెల్స్‌ ఎంత ప్రధానమైన పాత్ర పోషించాడో తెలుస్తుంది. మానవ సమాజం పురోగమిస్తున్న ప్రస్తుత తరుణంలో, కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల నేపథ్యంలో ఎంగెల్స్‌ చేసిన ప్రతీ రచననూ మరోసారి చదవాల్సిన అవసరం ఉంది.
సంయుక్తంగా మార్క్సిజం ఆవిష్కరణ
ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ గురించి ప్రస్తావించేటప్పుడు తరుచూ ‘ఆయన ప్రపంచంలో తొలి మార్క్సిస్టు’ అని అభివర్ణిస్తారు. తనకు అంత పెద్ద ప్రాధాన్యత లేదన్నట్టుగా తనదైన నమ్రతతో వ్యవహరించే ఎంగెల్స్‌ ఈ హోదాను మాత్రం సగర్వంగా స్వీకరించి వుండేవాడు. ”మార్క్స్‌ ఏదైతే సాధించగలిగాడో, దానిని నేనైతే మాత్రం ఎన్నటికీ సాధించి వుండేవాడిని కాను. తక్కిన మా అందరికన్నా మార్క్స్‌ ఎత్తున ఉండేవాడు. మాకన్నా దూరం ఆలోచించేవాడు. మా అందరికన్నా తొందరగా, అందరికన్నా విశాలంగా చూడగలిగేవాడు. మార్క్స్‌ ఒక ప్రజ్ఞావంతుడైన మేధావి. మేమంతా మహా అయితే నైపుణ్యం గలవాళ్ళం మాత్రమే. అతనే లేకపోతే ఆ సిద్ధాంతం ఇప్పుడున్న దానికంటే చాలా వెనుకనే ఉండిపోయేది. అందుచేత ఆ సిద్ధాంతానికి ఆయన పేరు రావడమే సరైనది” అని ఎంగెల్స్‌ ఒక సందర్భంలో అన్నాడు.
ఇది ఎలా ఉన్నప్పటికీ, ఎంగెల్స్‌ గురించి మార్క్స్‌ అంచనా గమనార్హం. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం యొక్క సైద్ధాంతిక పునాదుల ఆవిష్కరణలో ఎంగెల్స్‌కు మార్క్స్‌ ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు.
మార్క్స్‌-ఎంగెల్స్‌ సహచర్యం
‘రేనిష్‌ జేటుంగ్‌’ అనే పత్రికకు మార్క్స్‌ సంపాదకుడిగా ఉండేవాడు. మార్చి 1843లో ఆ పత్రికను మితవాద ప్రష్యన్‌ ప్రభుత్వం నిషేధించింది. 1844 ప్రారంభంలో మార్క్స్‌ పారిస్‌ కు మకాం మార్చాడు. అక్కడ మార్క్స్‌ ”డేయిష్‌ ఫ్రాంజోసిష్‌ జాబుషర్‌” అనే పత్రిక సంపాదకత్వం చేపట్టాడు. ఆనాడు ఈ పత్రికకు వ్యాసాలు పంపే వారిలో అతి పిన్న వయస్కుడు ఎంగెల్స్‌. తర్వాత కాలంలో నిర్వహణలో సహచరుడిగా మారాడు. 1844లో ”రాజకీయ అర్థశాస్త్ర విమర్శ సింహావలోకనం” అనే వ్యాసాన్ని ఎంగెల్స్‌ రాశాడు. ఈ వ్యాసంలో బూర్జువా అర్థశాస్త్ర విమర్శకు సంబంధించిన మూల సూత్రాలను పేర్కొన్నాడు. బూర్జువా ఆర్థిక వ్యవస్థ లోని అన్ని లక్షణాలూ ఉత్పత్తి సాధనాలపై ప్రైవేటు యాజమాన్య హక్కులను కల్పించే నిబంధనల నుండే అనివార్యంగా పుట్టుకొస్తాయని నిరూపించాడు. ఈ ప్రైవేటు యాజమాన్యం పోకుండా సమాజంలో పేదరికాన్ని పోగొట్టడం సాధ్యం కాదని కూడా నిరూపించాడు. దీనితో మార్క్స్‌ ముగ్ధుడయ్యాడు. హెగెలియన్‌ తత్వశాస్త్రంపై విమర్శ ద్వారా తాను ఏ నిర్ధారణకు వచ్చాడో, అదే నిర్ధారణకు మరొక మేధావి బూర్జువా ఆర్థిక వ్యవస్థపై విమర్శ ద్వారా వచ్చినట్టు నిర్ధారణకు వచ్చాడు. మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం ఒక సిద్ధాంతంగా రూపు దిద్దుకోవడంలో వారిరువురి కృషి ఉమ్మడిగా సాగడానికి, వారి స్నేహానికి, ఉద్యమంలో కలసి పని చేయడానికి, జీవితాంతం సహచరులుగా కొనసాగడానికి ఇది పునాది వేసింది.

”ఇంగ్లాండులో కార్మికుల స్థితిగతులు” అన్న గ్రంథాన్ని ఎంగెల్స్‌ రచించాడు. ఇది ఒక దిశా నిర్దేశం చేసిన రచన. ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవం ఏవిధంగా ప్రారంభం అయిందో, ఏ విధంగా పరిణామం చెందుతోందో పరిశీలిస్తున్న మార్క్స్‌ ఆలోచనను బాగా ప్రభావితం చేసింది ఈ రచన. ఆగస్టు 1844లో పది రోజుల పాటు వారిరువురూ చర్చలు సాగించారు. ఆ క్రమంలో ఎంగెల్స్‌లో ఉన్న ప్రజ్ఞను మార్క్స్‌ మరింతగా గుర్తించాడు. ఎంగెల్స్‌ ప్రదర్శించిన ధైర్యాన్ని, అంకితభావాన్ని, అతని ఏకాగ్రతను మార్క్స్‌ ఎంతగానో ప్రశంసించాడు. ఆనాటి సైద్ధాంతిక అంశాలన్నింటిపైనా వారిరువురికీ ఏకాభిప్రాయం ఉన్నట్టు గుర్తించాడు.
”పవిత్ర కుటుంబం” లేదా ”విమర్శనాత్మక విమర్శపై విమర్శ” అన్న పుస్తకాన్ని ఇద్దరూ ఉమ్మడిగా 1844లో రచించారు. తత్వశాస్త్రం పైన, రాజకీయ అర్థశాస్త్రం పైన భావవాదం చూపుతున్న ప్రభావాన్ని పటాపంచలు చేస్తూ ఆ రచన సాగింది.

ప్రకృతికి అతీతమైన శక్తులు గాని, మానవ చైతన్యం గాని లేదా కొందరు విశిష్ట వ్యక్తులు గాని చరిత్రను సృష్టించరని వారిద్దరూ ఆ గ్రంథంలో రుజువు చేశారు. సమాజం ముందుకు సాగేది శ్రామిక ప్రజల శ్రమ వలన, వారు నడిపే రాజకీయ పోరాటాల వలన మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారీ సమాజంలో తమ జీవన సరిస్థితుల్ని మార్చకుండా శ్రామికవర్గం స్వేచ్ఛ పొందజాలరని, అందుచేత సమాజాన్ని దోపిడీ నుండి విముక్తి చేసే చారిత్రిక కర్తవ్యాన్ని శ్రామిక వర్గం నిర్వహించాల్సి వుంటుందని వివరిస్తుంది.

తాత్విక రంగంలో అప్పటి వరకూ పైచేయిగా ఉన్న భావవాదాన్ని ఎదిరించి భౌతికవాద పునాదిపై తత్వశాస్త్రాన్ని తిరిగి నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది. 1845-46లో ”జర్మన్‌ తత్వశాస్త్రం” అన్న గ్రంథం ద్వారా మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆ పని పూర్తి చేశారు. వారు ఉభయులూ చేసిన ఈ రచనలో సమగ్రంగా, ఒక క్రమ పద్ధతిలో శ్రామికవర్గ ప్రాపంచిక దృక్పథం అయిన గతితార్కిక, చారిత్రిక భౌతిక వాదానికి సంబంధించిన మూల సూత్రాలను రూపొందించారు.

నిజానికి, 1843-45 మధ్యకాలం మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం పరిణామంలో చాలా ఫలవంతమైన కాలం. విప్లవకర ప్రజాస్వామ్యం నుండి శ్రామికవర్గ విప్లవంగా, హెగెలియన్‌ ప్రభావం నుండి చారిత్రిక భౌతికవాదంగా, తత్వ శాస్త్రం నుండి రాజకీయ అర్థశాస్త్రం వైపుగా మలుపు తిరిగింది. మార్క్స్‌, ఎంగెల్స్‌ ఇద్దరూ కలిసి ఈ మౌలిక కృషి చేశారు.

న్యాయం గురించిన హెగెలియన్‌ తాత్విక సిద్ధాంతాన్ని మార్క్స్‌ విమర్శనాత్మకంగా పరిశీలించాడు. న్యాయ సంబంధాలు కాని, రాజకీయ రూపాలు గాని వాటంతట అవే మనకు అవగతం కావని, మానవ మేధస్సు, లేదా చైతన్యం చెందే పరిణామం బట్టి కూడా అవగతం కావని, జీవితపు భౌతిక అస్తిత్వాన్ని బట్టి, అది ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి మాత్రమే అవగతం చేసుకోగలుగుతామని మార్క్స్‌ నిర్ధారణకు వచ్చాడు. ”పౌర సమాజం” అన్న పేర హెగెల్‌ ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని చిత్రించాడు. ”అఖండ భావం సాకారమయ్యే కొద్దీ” ప్రకృతికి అతీతమైన దాని ప్రభావం వలన ఈ ఆదర్శ సమాజం రూపొందుతుందని హెగెల్‌ భావించాడు. అయితే మార్క్స్‌ మాత్రం పౌర సమాజం నిర్మాణం రాజకీయ అర్థశాస్త్రం లోనే దొరుకుతుందన్న నిర్ధారణకు వచ్చాడు. అక్కడ నుండి మొదలై గతితార్కిక భౌతికవాదపు శక్తివంతమైన మూలసూత్రం ”మానవుల చైతన్యం వారి అస్తిత్వాన్ని నిర్ణయించదు. తద్భిన్నంగా వారి సామాజిక అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది.” వద్దకు వచ్చాడు. 1848లో ”కమ్యూనిస్టు ప్రణాళిక”ను ఇద్దరూ ఉమ్మడిగా రచించారు. మొదటి ఇంటర్నేషనల్‌ స్థాపనలో ఇద్దరూ ముఖ్య పాత్ర పోషించారు. తత్వశాస్త్రం పైన, రాజకీయ అర్థశాస్త్రం పైన విమర్శలను మేళవించి వారిద్దరూ రూపొందించిన విప్లవ సిద్ధాంతం ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లో వ్యక్తమైంది.
ప్రకృతిలో గతితర్కం, మానవ సమాజ జీవితం
పెట్టుబడిదారీ వ్యవస్థ నడకను చీల్చి చెండాడే పనిలో మార్క్స్‌ పూర్తిగా మునిగిపోయాడు. ఆ కృషి పెట్టుబడి గ్రంథ రూపం అంతిమంగా తీసుకుంది. అందులో పెట్టుబడిదారీ ఉత్పత్తి క్రమంలోనే మానవ శ్రమ దోపిడీ జరుగుతుందని నిరూపించాడు. అందుచేత మానవజాతి విముక్తి సాధించాలంటే పెట్టుబడిదారీ సమాజాన్ని కూలదోయడం అనేది కేవలం ఒక నైతికమైన కర్తవ్యం మాత్రమే కాదని, అదొక శాస్త్రీయమైన ఆవశ్యకత అని రుజువు చేశాడు. ఈ సమయంలో గతితర్కాన్ని, ఇతర రంగాలలోకి విస్తరించి వర్తింపజేయడంమీద ఎంగెల్స్‌ దృష్టిని కేంద్రీకరించాడు.

మానవుడు-ప్రకృతి యొక్క గతితర్కం: గతితార్కిక చారిత్రిక భౌతిక వాదానికి ప్రాతిపదిక మానవుడికి, ప్రకృతికి నడుమ నిరంతరం ఉండే గతితార్కిక సంబంధం. తన జీవితాన్ని, తన చుట్టూ ఉండే పరిస్థితులను మరింత మెరుగు పరుచుకోవడం కోసం ప్రకృతిని తనకనువుగా మలుచుకొనే ప్రయత్నాలను మానవులు నిరంతరం సాగిస్తూనే వుంటారు. ఈ క్రమంలో మానవులు ప్రకృతిని తమకనుగుణంగా మార్చుకుంటూ వున్నప్పుడే ప్రకృతి కూడా మానవులను, మానవ పరిణామాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదొక గతితార్కిక క్రమం. ”వానరుడి నుండి నరుడిగా మారిన పరిణామ క్రమంలో శ్రమ పాత్ర” అన్న తన వ్యాసంలో ఎంగెల్స్‌ మానవులకు, ప్రకృతికి మధ్య గతితార్కిక క్రమం ఏవిధంగా పరిణామం చెందుతుందో వివరించాడు. మనిషి చేతులు, జ్ఞానేంద్రియాలు, వాక్కు వంటివి అభివృద్ధి చెందడం వెనక శ్రమ ఎటువంటి పాత్ర పోషించిందో తెలియజేశాడు. ఇవన్నీ ఏదో ఒక దైవశక్తి సృష్టించినవి కావని, భౌతిక జీవిత క్రమంలోనే అవి రూపొందాయని తేల్చిచెప్పాడు.

ప్రకృతిలో గతితర్కం : ప్రకృతికి, శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి గతితార్కిక భౌతికవాదాన్ని వర్తింపజేస్తూ ఎంగెల్స్‌ ముందుకు సాగాడు. ”ప్రకృతి, మానవ సమాజం, ఆలోచన -వీటిలో కలిగే మార్పులకు, అభివృద్ధికి సంబంధించిన సర్వ సాధారణ నియమాలే గతితర్కం” అని నిర్ధారించాడు.

గతితర్కం-ఆంత్రోపాలజీ : (మానవుడు ఒక జంతువు అనే దృష్టితో చేసే సంపూర్ణ పరిశీలన-ఆంత్రోపాలజీ) ఎంగెల్స్‌ తన కాలం నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా (ప్రాచీన సమాజాల, త్రవ్వకాలలో లభించిన అవశేషాల, పరిశోధనల ఆధారంగా) చారిత్రిక భౌతిక వాదాన్ని మానవ పరిణామ క్రమానికి వర్తింపజేశాడు. ”కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం ఆవిర్భావం” అన్న తన గ్రంథంలో ఆధునిక వర్గ సమాజం గురించి ప్రచారంలో ఉన్న కట్టుకథలనన్నింటినీ బట్టబయలు చేశాడు. ఆస్తి ప్రాతిపదికన ఏర్పడిన వర్గ సంబంధాలు ఏవిధంగా కుటుంబం పుట్టుకను మార్చివేశాయో, చారిత్రికంగా స్త్రీ ఏవిధంగా ఓటమి చెందిందో, పాతివ్రత్యం, పితృస్వామిక సమాజం, వాటి పర్యవసానంగా మహిళల అణచివేత ఏవిధంగా సంభవించాయో నిరూపించాడు.

గతితర్కం-చరిత్ర : ”జర్మనీలో రైతాంగ యుద్ధం” (1849-50) అనే గ్రంథంలో మొదటిసారిగా ఎంగెల్స్‌ గతితార్కిక భౌతిక వాదాన్ని వాస్తవ చరిత్రకు వర్తింపజేశాడు.

గతితర్కం-తత్వశాస్త్రం : యూజెన్‌ డూరింగ్‌ అనే ఒక తత్వవేత్త మార్క్సిజాన్ని పూర్వపక్షం చేస్తూ తానొక బ్రహ్మాండమైన సిద్ధాంతాన్ని రూపొందించానని చెప్పుకున్నాడు. అతగాడి సిద్ధాంతాన్ని ఖండిస్తూ యాంటీ-డూరింగ్‌ అనే గ్రంథాన్ని ఎంగెల్స్‌ రచించాడు. మార్క్సిజాన్ని, గతితార్కిక, చారిత్రిక భౌతిక వాదాన్ని సమర్ధిస్తూ సాగిన ఈ గ్రంథం చాలా ప్రభావం కలుగజేసింది. అందుచేత, దాదాపు అన్ని రకాల కార్యాచరణ లోనూ, ప్రయత్నాల లోనూ మార్క్స్‌తో కలిసి సంయుక్తంగా, స్వతంత్రంగా ఎంగెల్స్‌ చాలా ఫలవంతమైన కృషి చేశాడు. ప్రకృతి శాస్త్రాలలో, ఆంత్రోపాలజీలో, చరిత్రలో, రాజకీయ అర్థశాస్త్రంలో, తత్వశాస్త్రంలో మానవుడు- ప్రకృతి నడుమ గల గతితార్కిక సంబంధం ఏవిధంగా వర్తిస్తుందో వివరించాడు. తద్వారా విప్లవోద్యమానికి, విప్లవ సిద్ధాంత పునాదుల నిర్మాణానికి తన వంతుగా ప్రత్యేక సేవ, తోడ్పాటు చేశాడు. వారిద్దరూ విడివిడిగా గాని, ఉమ్మడిగా గాని చేసిన రచనలు అన్నీ ఆ ఇద్దరూ పరస్పరం చర్చించుకున్నాకనే చేశారని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
రాజకీయ కార్యాచరణ
నవ యుగానికి బాటలు వేసే ఇటువంటి సిద్ధాంతానికి పునాదులు వేసిన ఈ ఇద్దరు మహానేతలూ అంతర్జాతీయ కార్మిక ఉద్యమంలో కేవలం సిద్ధాంతాన్ని బోధించేందుకే పరిమితం కాలేదు. ఆనాటి కార్మికోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కొన్ని సందర్భాలలో వాటికి నాయకత్వం వహించారు, మార్గదర్శకత్వం అందించారు. శ్రామిక వర్గాన్ని విజయ సాధన దిశగా నడిపించే శక్తి గల ఒక విప్లవకర సంస్థ నిర్మాణానికి ఈ ఇద్దరు మహా నేతలూ తమ జీవితాలను ధారపోశారు. మొదటి ఇంటర్నేషనల్‌ అనే పేర ప్రసిద్ధికెక్కిన ‘ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌మెన్స్‌ అసోసియేషన్‌’ను స్థాపించడంలో (1864) వారిద్దరూ ముఖ్య పాత్రను పోషించారు. వామపక్షవాద గ్రూపులన్నింటినీ ఒక ఉమ్మడి సంస్థ లోకి తీసుకు వచ్చి సంఘటితం చేయడానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నం అది. అంతర్జాతీయ కార్మికోద్యమంలో అది ముఖ్యమైన తొలి అడుగు.

శాస్త్రీయత-విప్లవకారుడు
అంతర్జాతీయ కార్మికోద్యమానికి, ప్రపంచానికి మార్క్సిస్టు దృక్పథం గురించి, ఎంతో విలువైన ఆ సిద్ధాంత పునాదుల గురించి, మార్క్స్‌ మరణానంతరం ఎంగెల్స్‌ ద్వారానే ప్రధానంగా తెలిసింది. అసంఖ్యాకంగా మార్క్స్‌ విడిచి వెళ్ళిన ఆయన నోట్సులను ఒక క్రమ పద్ధతిలో పెట్టి వాటిని ఎడిట్‌ చేసి ‘పెట్టుబడి’ గ్రంథం రెండవ, మూడవ సంపుటాలను ప్రచురించడంలో ఎంగెల్స్‌ కీలక పాత్ర పోషించాడు. ‘కమ్యూనిస్టు ప్రణాళిక’కు, వారిద్దరి ఇతర రచనల మలి సంపుటాలకు ఆయా వర్తమాన పరిణామాల ఆధారంగా ముందు మాటలు రాశాడు. తద్వారా అంతర్జాతీయ కార్మిక వర్గ పోరాటాలు ముందుకు సాగడానికి ప్రేరణ కలిగించాడు.

లెనిన్‌ చెప్పినట్టు ఎంగెల్స్‌ ”శ్రామిక వర్గానికి తామేమిటో నేర్పి తమ గురించిన స్పృహ కలిగించాడు, కలల స్థానే శాస్త్రీయతను ప్రతిష్టించాడు”.

Courtesy Prajashakti

Search

Latest Updates