ఢిల్లీ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మే25న లోక్‌సభకు చివరి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని క్యాంపస్‌లోని పలు గోడలపై నినాదాలు రాశారు విద్యార్ధులు.
దీనికి భగత్ సింగ్ ఛత్ర ఏక్తా మంచ్ (BCEM) బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నినాదాల ఫోటోలను పోస్ట్ చేసింది. గోడలపై “ఏక్ హీ రాస్తా నక్సల్బరీ” వంటి నినాదాలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినందుకు ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు గురువారం (మే 23) తెలిపారు. దేశ రాజధానిలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25 (శనివారం) చివరి దశలో పోలింగ్ జరగనుంది.
గురువారం ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో రాసిన నినాదాలను గమనించినట్లు పోలీసులు తెలిపారు. డిఫేస్‌మెంట్ చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.